Begin typing your search above and press return to search.

జగన్ సంస్కారం చూసి ఆ మంత్రులు షాక్

By:  Tupaki Desk   |   9 Dec 2016 8:27 AM GMT
జగన్ సంస్కారం చూసి ఆ మంత్రులు షాక్
X
వారంతా పొద్దున లేచింది మొదలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తనపై దుమ్మెత్తిపోసే నాయకులు. తనపై విమర్శల వర్షం కురిపించడానికి పోటీపడే నేతలు.. అసెంబ్లీలోనూ తాను ఒక్క మాట మొదలుపెడితే చాలు అడ్డుకోవడానికి లేచి మైకు అందుకుని అడ్డంగా మాట్లాడే మంత్రులు.. అలాంటివారు కళ్లెదుట కనిపిస్తే ఎలాంటి వాళ్లకైనా కోపం నషాళానికంటుతుంది. నిత్యం తనను తిట్టేవారు వచ్చి పక్కన కూర్చుంటే మాట్లాడడం కాదు ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడం. కానీ... సంస్కారవంతులు మాత్రం అలా చేయరు. తనను తిట్టడం వాళ్ల వృత్తిలో భాగం అనుకుంటారు.. వాళ్ల అధినేతను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అనుకుంటారు... రాజకీయాల్లో అలాంటి సంస్కారం చాలా అరుదు. అందులోనూ క్రోధావేశాలకు మారుపేరైన యువతరంలో మరీ అరుదు. కానీ... యువ నాయకుడు, వైసీపీ అధినేత చూపించిన సంస్కారానికి ఆయన్ను నిత్యం దూషించే టీడీపీ మంత్రులే షాక్ అయ్యారట.

ఈ ఘటన రీసెంటుగానే జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న విమానంలో జగన్, కొందరు ఏపీ మంత్రులు కలిసి ప్రయాణం చేశారు.ఆ సందర్భంగా జగనే వారిని తొలుత పలకరించి తమ మధ్య ఏమీ లేదన్నట్లుగా, తన పార్టీ నేతలతో మాట్లాడినంత సింపుల్ గా మాట్లాడడం చూసి వారు ఆశ్చర్యపోయారట.

ఇటీవల జగన్, టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు ఒకే విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం బయలుదేరారు. అచ్చెన్నాయుడు, జగన్ కు పక్కపక్క సీట్లు వచ్చాయి. వీరి ముందు వరుసలో రాష్ర్ట 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ సాయిబాబా, వెనుక సీట్లో మంత్రులు ప్రత్తిపాటి, కేఈలు ఉన్నారు.

ఈ సందర్భంగా జగన్ తొలుత తన ముందు సీట్లో ఉన్న సాయిబాబాను పలకరించి... ‘‘మీడియా అంతా నువ్వే కనిపిస్తూ, మమ్మల్ని ఏకిపారేస్తున్నావు కదా’’ అని సరదాగా నవ్వుతూ అన్నారట. ఆ వెంటనే ‘‘పుల్లన్నా.. అచ్చెన్నా నమస్కారం" అంటూ ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడులను కూడా జగనే పలకరించారట. అయితే... వారిని ఇంకా పలకరిస్తుండగానే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కలగజేసుకుని.. తనను పలకరించలేదని కాస్తంత అలిగినట్లుగా.. "ఏమయ్యా జగన్.. నీకు ఉత్తరాంధ్ర, కోస్తావాళ్లే కనిపిస్తారా?.. మన రాయలసీమోళ్లని మర్చిపోతావా" అని అన్నారు. జగన్ వెంటనే... "పెద్దాయనా..." అంటూ ఆప్యాయంగా పలకరించి... "మిమ్మల్ని చూడలేదు. హరి ఎలా ఉన్నాడు?" అని అడిగారు. కేఈ కుమారుడు హరి, జగన్ లు క్లాస్ మేట్లు. కుమారుడి గురించి అడిగాక కేఈ జగన్ తో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఆ తరువాత జగన్ పక్కనే ఉన్న అచ్చెన్నాయుడుతోనూ నవ్వుతూ మాట్లాడుతుండడంతో మిగతా ప్రయాణికులంతా ఆశ్చర్యపోవడమే కాదు.. టీడీపీ మంత్రులూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కేఈ కృష్ణమూర్తికి జగన్ బాగానే పరిచయం ఉన్నప్పటికీ అచ్చెన్నాయుడు మాత్రం నిత్యం విరుచుకుపడే తనతో జగన్ ఏమీ లేనట్లుగా అలా మాట్లాడుతారని ఏమాత్రం ఊహించలేదట.