Begin typing your search above and press return to search.

బెస్ట్ పాల‌సీ అంటే ఏంటండి రోజా గారూ ?

By:  Tupaki Desk   |   22 April 2022 5:30 PM GMT
బెస్ట్ పాల‌సీ అంటే ఏంటండి రోజా గారూ ?
X
అధికారం ద‌క్కించుకున్నాక వైసీపీతో పాటు సంబంధిత వ‌ర్గాలు కొన్ని విష‌యాలను ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న విమర్శ నుంచి ముందు దూరం కావాలి. బెస్ట్ క్రీడా పాల‌సీ తీసుకువ‌స్తామ‌ని అంటున్నారు మంత్రి రోజా వాటి మాట దేవుడెరుగు ముందు చాలా చోట్ల చాలా జిల్లాల‌లో స్టేడియంల‌కు క‌నీస వ‌స‌తులు లేవు. గ్రామీణ క్రీడ‌ల‌కు ఇవాళ ప్రోత్సాహ‌మే లేదు.

రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను ప్రోత్స‌హించేందుకు అస్స‌లు టోర్న‌మెంట్ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఊసే లేదు. ఈ ద‌శ‌లో రోజా మేడ‌మ్ చెబుతున్న మాట‌లు అన్నీ చాలా బాగున్నాయి కానీ ఆచ‌ర‌ణ‌కు నిధులు కావాలి. లేదా వైసీపీ నేత‌లే నిధుల‌ను దాత‌ల నుంచి సేక‌రించాలి. ఇప్ప‌టికే చాలా ప్ర‌యివేటు సంస్థ‌లు త‌మ క్రీడాస‌క్తి మేర‌కు కొంద‌రు ఔత్సాహికుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి కానీ ఆ స్థాయిలో ప్ర‌భుత్వం నుంచి వారికి ఎటువంటి ఆర్థిక సాయం అంద‌డం లేదు.

ఒలంపిక్స్ లో రాణించాలి లేదా ప్రపంచ స్థాయిలో మ‌న బిడ్డ‌లు రాణించాలి అని చెప్పుకోవ‌డం మిన‌హా క‌నీసం వారికి అందాల్సిన వ‌స‌తుల విష‌య‌మై ఏమీ ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న విష‌యాన్ని ఆమె గుర్తించాలి. గ్లామ‌ర్ తో కూడిన నాలుగు మాట‌లు చెప్పినంత కాలం అవి ఏమీ మేలు చేయ‌వు క‌దా! అని టీడీపీ ఇదే అదునుగా విమ‌ర్శ‌లు చేస్తోంది.

క్రీడ‌ల‌కు సంబంధించి మంచి పాల‌సీ ఒక‌టి తీసుకుని వ‌స్తామ‌ని అంటున్నారు మంత్రి రోజా సెల్వ‌మ‌ణి. ఆ మేర‌కు అంతా త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని కూడా అంటున్నారు. ఇదంతా బాగుంది. వీటికి నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి.. దాత‌లే స‌హరించాల‌ని మ‌ళ్లీ వేడుకోవ‌డం ఏంటి? క్రీడ‌ల‌కు సంబంధించి గ్రామ‌, మండ‌ల, జిల్లా స్థాయిలలో ప్రోత్సాహం అందిస్తామ‌ని చెప్పారు స‌రే ! ఇంత‌కూ వాటిపై ఆమెకు ఉన్న స్ప‌ష్ట‌త ఎంత ? వీట‌న్నింటి గురించి చ‌ర్చించే ముందు ఇప్ప‌టికే పెండింగ్ లో ఉన్న కొన్ని ప‌నులు గురించి మాట్లాడుకుందాం.

మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న రోజా సెల్వ‌మ‌ణి ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే.. శ్రీ‌కాకుళం లాంటి వెనుక‌బ‌డిన జిల్లాకు ఓ ఉత్త‌మ రీతిలో స్టేడియం నిర్మాణం అవ‌స‌రం అని, ఇక్క‌డ ఉన్న కోడి రామ్మూర్తి స్టేడియం ప‌నులు అర్ధంత‌రంగా ఆగిపోవ‌డంతో త‌రువాత వీటి ఊసే ఎవ్వ‌రూ ఎత్త‌లేద‌ని ముందుగా ఆమె గుర్తించాలి. తెలుగుదేశం హ‌యాంలో పున‌ర్నిర్మాణ ప్ర‌క్రియ‌కు 11 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని భావించారు.

కొంత మొత్తంతో ప‌నులు చేప‌ట్టి వ‌దిలేశారు. ఇప్పుడు రోజా మంత్రి అయి ఉన్నారు క‌నుక దీనిపై దృష్టి సారించాలి. ఇదొక్క‌టే కాదు క‌నీసం ఉద‌యం వేళ‌ల్లో న‌డిచేందుకు పూర్తి స్థాయిలో వాకింగ్ ట్రాక్ కూడా లేని వైనాన్ని గుర్తించాలి. ప్ర‌జారోగ్యం పెంపొందించేందుకు కృషి చేయాలి. ఒక్క శ్రీ‌కాకుళం అనేకాదు రాష్ట్రంలో చాలా పాఠ‌శాల‌ల‌కు కానీ లేదా స్టేడియంల‌లో కానీ మౌలిక వ‌స‌తులు లేనే లేవు. నాడు నేడు తో బాగు ప‌డిన పాఠ‌శాల‌లు మాత్రం కాస్త బెట‌ర్. మ‌రి! మిగ‌తా వాటి సంగ‌తో !