Begin typing your search above and press return to search.

కారులో వెళ్లాల్సిన మంత్రి బైక్‌పై వెళ్లారు.. తెలిసిందా జ‌గ‌న‌న్నా.. రీజ‌నేంటో!!

By:  Tupaki Desk   |   22 Jan 2023 4:30 PM GMT
కారులో వెళ్లాల్సిన మంత్రి బైక్‌పై వెళ్లారు.. తెలిసిందా జ‌గ‌న‌న్నా.. రీజ‌నేంటో!!
X
మంత్రి అంటే ఒకింత ఆర్భాటం. ఇంటినుంచైనా.. ఆఫీసు నుంచైనా కాలు బ‌య‌ట పెడితే ఇక, మందీ మార్బ‌లం, అధికారులు.. భ‌ద్ర‌త‌.. పోలీసుల ర‌క్ష‌ణ ఇవ‌న్నీ కామ‌న్‌. అయితే.. అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రి ఉష శ్రీచ‌ర‌ణ్‌.. వీట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టేశారు. కారును కూడా ఎక్క‌లేదు. కేవ‌లం బైక్‌పై వెళ్లారు. అది కూడా.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు మ‌రి దీనికి రీజ‌నేంటి?

ఆ మంత్రి ఏదో.. డౌన్ టు ఎర్త్ అంటే.. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాల‌నే సూత్రాన్ని ఏమీ ఫాలో కాలేదు. కేవ‌లం ఆమె వెళ్లాల‌ని అనుకున్న గ్రామానికి రోడ్లు ఏమాత్రం బాగోలేక పోవ‌డంతో కారు వెళ్ల‌ద‌ని డ్రైవ‌ర్ , పోలీసులు తేల్చి చెప్ప‌డంతో బైక్‌పై వెళ్లార‌న్న మాట‌.ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాదు.. చూశావా.. జ‌గ‌న‌న్నా.. మ‌న పాల‌న ఎలా ఉందో అని కామెంట్లుకూడా కుర‌స్తున్నాయి.

ఏం జ‌రిగిందంటే..

అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం కొల్లరహట్టిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఉషశ్రీ బయల్దేరారు. అయితే, ఆ గ్రామానికి వెళ్లే రోడ్డు మోకాల్లోతు గోతుల‌తో నిండి ఉంద‌ని, మంత్రి కాన్వాయ్‌ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంద‌ని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మంత్రి తన అనుచరులతో కలిసి ఒక‌రి బైక్‌పైఎక్కి గ్రామానికి చేరుకున్నారు. మంత్రి బైక్‌పై ప్రయాణించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్డు బాగాలేదని పలుమార్లు ఆ గ్రామస్థులు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు అదే మార్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ బైక్‌పై గడపగడపకూ వెళ్లాల్సి వచ్చింది.

రోడ్ల ప‌రిస్థితి ఇదీ..
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం శీగలపల్లి నుంచి కొల్లరహట్టికి వెళ్లే 1.5 కి.మీ. మట్టి రోడ్డు అధ్వానంగా ఉంది. గత మూడేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోలేదు. 4 నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. కొల్లరహట్టి గ్రామస్థులు కాలినడకన, బైక్‌ల‌పై పొలాల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. ఇక‌, త‌న ప‌ర్య‌ట‌న‌లోనూ మంత్రి క‌రుణించ‌లేదు. ప్రస్తుతం నిధుల సమస్య ఉందని, త్వరలో నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.