Begin typing your search above and press return to search.

తిరుమ‌ల అల‌జ‌డి.. అధిష్టానం అలా.. నేత‌లు ఇలా..!

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:05 AM GMT
తిరుమ‌ల అల‌జ‌డి.. అధిష్టానం అలా.. నేత‌లు ఇలా..!
X
వైసీపీ అధిష్టానం చెబుతున్న దానికి, పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌నుల‌కు పొంతన లేకుండా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. సామాన్య‌ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగించొద్ద‌ని.. పార్టీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. వారి క‌ష్టాలు తెలుసుకుని.. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం కూడా చేయాల‌ని సూచిస్తున్నారు. అయితే.. ఈ విష‌యంలో నాయ‌కులు ఏం చేస్తున్నారో తెలియ‌దు కానీ.. ప్ర‌జ‌ల‌ను మాత్రం ముప్పుతిప్ప‌లు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా నిత్యం అత్యంత ర‌ద్దీగా ఉండే.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యే ల తాకిడి ఎక్కువ‌గా ఉంటోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ‌రుస‌గా తిరుమ‌ల‌లోనే తిష్ట‌వేస్తున్నారా? అనే విమ‌ర్శ‌లు వ‌చ్చేలా .. మంత్రులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉష శ్రీచ‌ర‌ణ్ నుంచి సీదిరి అప్ప‌ల‌రాజు వ‌ర‌కు.. చాలా మంది మంత్రులు.. తిరుమ‌ల‌కు వెళ్ల‌డం.. అక్క‌డ రాజ‌కీయం చేయ‌డం.. పార్టీకి పెను ముప్ప‌గా మారిపోయింది. శ్రీవారిపై భ‌క్తి ఉండొచ్చు..కానీ, దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది క‌దా అంటున్నారు సామాన్యులు.

కొన్నాళ్ల కింద‌ట ఏకంగా 150 మందిని త‌న వెంట తీసుకువెళ్లిన మంత్రి సీదిరి.. తీవ్ర వివాదానికి దారితీ శారు. ఇక‌, ఇటీవ‌ల ఉష శ్రీచ‌ర‌ణ్ 50 మందిని వెంట‌బెట్టుకుని వెళ్లి బ్రేక్ ద‌ర్శ‌నం ఇస్తారా? చ‌స్తారా? అని అధికారుల‌పై ఒత్తిడి పెంచారు. మ‌రోవైపు.. మంత్రి రోజా.. వారానికి మూడు సార్లు తిరుమ‌ల‌లోనే క‌నిపిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన నారాయ‌ణ స్వామి కూడా వారానికి రెండు మూడు సార్లు.. శ్రీవారి ద‌ర్శ‌నం అంటూ.. కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల గిరులు ఎక్కేస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌తో సామాన్య భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్రొటోకాల్ ద‌ర్శ‌నం ఉంటే దానిని వినియోగించుకోవ‌డం త‌ప్పుకాదు. లేదా.. ఏ రెండు మూడు మాసాల‌తో స్వామిని ద‌ర్శించ‌డం కూడా త‌ప్పుకాదు. అయితే..వారంలో రెండు రోజుల పాటు అక్క‌డే తిష్ట‌వేసి.. సామాన్యుల‌ను ఇబ్బందికి గురి చేయ‌డ‌మే.. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా పార్టీ విమ‌ర్శ‌ల పాల‌య్యేలా చేస్తోంద‌ని అంటున్నారు. మ‌రి మంత్రులు ఇప్ప‌టికైనా.. త‌మ ప‌ద్ధ‌తి మార్చుకుంటారో లేదో చూడాలి.