Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులు అందరికి తెలుసు.. కానీ వారు చేసే పనే తెలీయటం లేదే?

By:  Tupaki Desk   |   12 Nov 2021 12:30 AM GMT
ఏపీ మంత్రులు అందరికి తెలుసు.. కానీ వారు చేసే పనే తెలీయటం లేదే?
X
ఎప్పుడూ లేని సిత్రమైన పరిస్థితి ఏపీలో ఇప్పుడు చోటు చేసుకుంది. సాధారణంగా రాష్ట్రం ఏదైనా సరే.. మంత్రులు నిర్వహించే మంత్రిత్వ శాఖ పేరును చెప్పినంతనే ఫలానా పెద్ద మనిషి అన్న పేరును టక్కున చెప్పేస్తాం. కానీ..ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ నడుస్తోంది. ఏపీ మంత్రులుగా అందరికి సుపరిచిమైన వారు.. వారు ఏ శాఖకు మంత్రి అన్న విషయంలో మాత్రం అత్యధికులకు అవగాహన లేకపోవటం దీనికి నిదర్శం. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ఎవరి దాకానో ఎందుకు ఆళ్ల నాని.. కొడాలి నాని.. పేర్ని నాని.. అనిల్ కుమార్.. నారాయణస్వామి.. వెల్లంపల్లి శ్రీనివాసరావు.. అవంతి శ్రీనివాస్.. బాలినేని.. శంకర నారాయణ.. ధర్మాన కృష్ణదాసు.. మేకపాటి సుచరిత.. ఇలా పలువురి పేర్లు చెప్పినంతనే.. వారెందుకు తెలీదు.. మంత్రులు కదా అని చెప్పేస్తారు. మరి.. అయితే.. వారు నిర్వహించే మంత్రిత్వ శాఖ ఏమిటో చెప్పండి? అన్న ప్రశ్నను సంధిస్తే కొద్ది మంది తప్పించి అత్యధికులు సమాధానం చెప్పని పరిస్థితి నెలకొంది.
ఎందుకిలా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా మంత్రులు ఎవరైనా తాము నిర్వహించే మంత్రిత్వ శాఖ కారణంగా.. తమ పని తీరు కారణంగా అందరికి సుపరిచితులు అవుతారు.కానీ.. ఏపీ మంత్రుల్లో అత్యధికులు తమ పని తీరు కంటే కూడా తమ నోటి మాటలతో.. చేసే రాజకీయాలతోనే ప్రముఖులయ్యారు. మంత్రులుగా వ్యవహరిస్తున్న తాము.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు కేటాయించిన శాఖల మీద పట్టు పెంచుకునేలా పని చేయకపోవటం.. చిల్లర రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత.. తమ మంత్రిత్వ శాఖల్ని సమీక్షించే విషయంలో వెనుకబడి ఉండటమే ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పక తప్పదు.

మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తి కావటమే కాదు.. సీఎం జగన్ చెప్పినట్లుగా తమ అధికార కాలం సగం పూర్తి అయిన తర్వాత.. మొత్తం మంత్రివర్గం కానీ అత్యధికులకు పని తీరు ఆధారంగా ఉద్వాసన పలికి.. కొత్త వారితో జట్టు కడతానని ఇప్పటికే వెల్లడించారు. ఇలాంటి మాటల నేపథ్యంలో అయినా మంత్రులు తమ పని తీరుతో అందరి నోళ్లలో నానాలి. కానీ.. అందుకు భిన్నంగా పని తీరు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న వారు.. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం ముందు ఉంటున్నారు. మిగిలిన మంత్రుల్ని వదిలేద్దాం. ఒకే పేరు ఉండి.. ఇంటి పేర్లు వేరుగా ఉన్న ముగ్గురు మంత్రులు ఉండటం ఏపీలోనే అని చెప్పాలి.

ఆ ముగ్గురు మంత్రులు ఆళ్ల నాని.. పేర్ని నాని.. కొడాలి నాని. ఈ ముగ్గురు పేర్లు విన్నంతనే.. వాళ్లు మాకెందుకు తెలీదని చెప్పేస్తారు. నిత్యం మీడియాలో కనిపించే పేర్ని నాని..కొడాలి నాని నిర్వహించే మంత్రిత్వ శాఖ పేరు చెప్పమంటే మాత్రం వెంటనే చెప్పలేని పరిస్థితి. విపక్ష నేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ ను బండ బూతులు తిట్టే విషయంలో అందరికంటే ముందుండే కొడాలి నాని ఏ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తారు? ఆయన తన రెండున్నరేళ్ల పదవీ కాలంలో తనకు కేటాయించిన శాఖను ఎంతలా ముందుకు తీసుకెళ్లారన్నది చూస్తే నోరు విప్పలేని పరిస్థితి ఉందని చెబుతారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రిగా వ్యవహరించే ఆయన్ను బూతుల మంత్రిగానే అందరికి గుర్తు. మంత్రిగా చేయాల్సిన పని కంటే కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడనే ముద్ర కోసం ఆయన పడే తపన అంతా ఇంతా కాదంటారు. ఆళ్ల నాని విషయానికి వస్తే.. కరోనా లాంటి కీలక సమయంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్.. కరోనా కాలంలో ఆయన పని తీరు వేలెత్తి చూపలేనిరీతిలో ఉంటుంది. మరి..ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని మాత్రం కరోనా మొదటి దశలో కనిపించారు కానీ.. రెండో దశలో కనిపించలేదు.

ఆ మాటకు వస్తే వైద్యం కోసం కరోనారెండో దశలో హైదరాబాద్ కు బండ్లు కట్టించుకొని బారులు తీరిన వేళ.. తెలంగాణ ప్రభుత్వం నో అన్నప్పుడు కూడా ఆయన నోరు విప్పింది లేదు. వైద్యం కోసం వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితికి రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నా.. ఆయన అలాంటి ఆలోచన కూడా చేయలేదంటారు. ఇప్పటికి విజయవాడకు అప్పుడప్పడు మాత్రమే వచ్చే ఆయన పని తీరు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

మిగిలిన మూడో నాని.. పేర్ని నాని. రాజకీయ విమర్శలు ఎదురైనప్పుడు పంచులు వేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించే ఆయన రాష్ట్ర రవాణా..సినిమాటోగ్రఫీ.. సమాచార శాఖా మంత్రి. ఏ మాటకు ఆ మాట రవాణా శాఖా మంత్రిగాకంటే కూడా సమాచార శాఖా మంత్రిగా ఆయన సుపరిచితుడు. మీడియా నుంచి మిగిలిన అన్ని వర్గాల వారికి సౌమ్యుడుగా కనిపించే ఆయన.. పవన్ కల్యాణ్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా రియాక్టు అవుతుంటారు. ఆయన బీపీ లెవెల్స్ ఎంతలా పెరిగిపోతాయో తెలిసిందే. తన వద్దకు వచ్చిన అందరిని మాటలతో వారి మనసుల్ని దోచేయటమే కాదు.. అప్యాయంగా పలుకరించటం ద్వారా ఎంత తియ్యటి మనిషి అన్న భావన కలిగిస్తారు. ఇటీవల పవన్ ఎపిసోడ్ కారణంగా సినిటోగ్రఫీ మంత్రిగా ప్రజల్లో రిజిస్టర్ అయ్యారు. అలా అని వారి సమస్యల పరిష్కారానికి ఆయన చేసిందేమిటన్నది అందరికి తెలిసిందే.

ఇలా ఏపీ మంత్రులుగా ఉన్న ముగ్గురు నానిలు మాత్రమే కాదు.. మంత్రివర్గంలోని అత్యధిక మంత్రులు తమ పని తీరు విషయంలో మాత్రం ఎలాంటి మార్కు వేయలేకపోయిన పరిస్థితి. దీంతో..సీఎం జగన్ చెప్పిన రెండున్నరేళ్ల డెడ్ లైన్ పూర్తి అయిన వేళ.. పని తీరు ఆధారంగా చూస్తే మాత్రం మంత్రులుగా కొనసాగే కంటే మాజీలు అయ్యే అవకాశం ఎక్కువన్న మాట వినిపిస్తోంది. మరి.. ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.