Begin typing your search above and press return to search.

పీఠానికి క్యూ కడుతున్న మంత్రులు...

By:  Tupaki Desk   |   25 April 2022 12:30 PM GMT
పీఠానికి క్యూ కడుతున్న మంత్రులు...
X
వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ మతం పట్ల సక్రమంగా వ్యవహరించడంలేదు అని హిందూత్వ వాదులు విమర్శలు అయితే చేస్తారు కానీ గతం కంటే ఎక్కువగా గుళ్ళూ గోపురాలకు వెళ్లే వారు వైసీపీలోనే ఎక్కువ అయ్యారు. వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలే ఎక్కువ. ఇక పీఠాలను సందర్శించి స్వాములకు పూజలకు చేయడంలో ముఖ్యమంత్రి జగన్ ముందు వరసలో ఉంటే ఆ తరువాత మంత్రులు లైన్ కడుతున్నారు. జగన్ ఇప్పటికి చాలా సార్లు విశాఖ శారదాపీఠం వచ్చారు. వచ్చిన ప్రతీసారీ ఆయన కొన్ని గంటల పాటు అక్కడ గడిపి వెళ్తూంటారు.

అంతే కాదు, స్వామీజీ స్వారూపానందేంద్ర ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ఇలా తన వద్దకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా పెందుర్తిని విశాఖ జిల్లాలోనే ఉంచమని కోరానని, దానికి సీఎం జగన్ అంగీకరించారని కూడా ఈ మధ్య స్వామీజీ చెప్పుకున్నారు. ఇక కొత్త మంత్రులు వరసబెట్టి ఇపుడు పీఠానికి వస్తున్నారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజా ఈ మధ్యనే శారదాపీఠానికి వచ్చి స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇపుడు మరో మంత్రి అది కూడా విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజనీ కూడా స్వామి దర్శనానికి వచ్చారు. ఆమె కూడా ప్రత్యేక పూజలు పీఠంలో నిర్వహించారు.

అదే విధంగా కొత్త మంత్రి గుడివాడ అమరనాధ్ కూడా స్వామీజీని దర్శించుకున్నారు. ఇక విశాఖకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, సామాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ వంటివారు వచ్చారు. వారంతా స్వామీ ఆశీస్సులు అందుకున్న వారే.

ఈ మధ్యలో హర్యనాకు చెందిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. రానున్న రోజుల్లో మరింతమంది రాష్ట్రమంత్రులు విశాఖ రానున్నారు అని తెలుస్తోంది. ఇలా వచ్చిన వారు అప్పన్న దర్శనంతో పాటు స్వామి దర్శనం కూడా తప్పక చేసుకుని వెళ్ళడం ఖాయం. ఏది ఏమైనా సరే పీఠానికి మంత్రుల తాకిడి ఎక్కువ అయింది అంటున్నారు.