Begin typing your search above and press return to search.

ఏపీలో రెండు మంత్రి ప‌ద‌వులు త‌క్ష‌ణ‌మే ఖాళీ అవుతున్న‌ట్టే!

By:  Tupaki Desk   |   10 March 2020 6:42 AM GMT
ఏపీలో రెండు మంత్రి ప‌ద‌వులు త‌క్ష‌ణ‌మే ఖాళీ అవుతున్న‌ట్టే!
X
ఏపీలో శాస‌న‌మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడే పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ల మంత్రి ప‌ద‌వులు పోవ‌డం దాదాపు ఖాయ‌మైంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మండ‌లి ర‌ద్దుకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంది. అసెంబ్లీలో ఆ ప్ర‌క‌ట‌న చేసేట‌ప్పుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవిలు అక్క‌డే ఉన్నారు. వారు కూడా మండ‌లి ర‌ద్దు ప్ర‌తిపాద‌న‌లో మాట్లాడారు. మండ‌లి అన‌వ‌స‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.

అలా వారి మంత్రి ప‌ద‌వులు పోయే తీర్మానానికి వారే మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే ఇంకా మండ‌లి అధికారికంగా ర‌ద్దు కాలేదు. దానికి కేంద్రం ముద్ర అవ‌స‌రం ఉంది. మండ‌లి ర‌ద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెల‌పాలి, ఆ త‌ర్వాత లోక్ స‌భ‌లో అది ఆమోదం పొందాలి.

అవి ప్ర‌స్తుతానికి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంత వ‌ర‌కూ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ లు మంత్ర‌లుగా అయితే కొన‌సాగే అవ‌కాశం ఉంది. కానీ.. ఇప్పుడు వారి ప‌ద‌వులు త‌క్ష‌ణం ఖాళీ కాబోతున్న‌ట్టే!

వారిద్ద‌రినీ రాజ్య‌స‌భ‌ కు నామినేట్ చేయ‌డానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వారు రాజ్య‌స‌భ‌ కు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌బోతూ ఉన్నారు. లాంఛ‌న‌మైన ఎన్నిక‌తో వారు ఢిల్లీ బాట ప‌ట్ట‌బోతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో వారు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం ఖాయ‌మైన‌ట్టే. రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎన్నికైన వెంట‌నే.. వారు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌వ‌చ్చు. దీంతో అతి త్వ‌ర‌లో ఏపీలో రెండు మంత్రి ప‌ద‌వులు ఖాళీ కాబోతున్న‌ట్టే. అయితే ఏపీలో మంత్రి ప‌ద‌వుల భ‌ర్తీ స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ అంతా పూర్తి అయిన త‌ర్వాతే ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న మంత్రి వర్గాన్ని పున‌ర్వ్య‌స్థీక‌రించ‌వ‌చ్చు అని స‌మాచారం.