Begin typing your search above and press return to search.

అర్ధమవుతోందా : ఎమ్మెల్యేలకు జగన్ దర్శనం....?

By:  Tupaki Desk   |   16 July 2022 11:30 PM GMT
అర్ధమవుతోందా : ఎమ్మెల్యేలకు జగన్ దర్శనం....?
X
ఏపీలో జనాలతో కానీ ప్రజా ప్రతినిధులతో కానీ పెద్దగా కనెక్షన్ పెట్టుకోకుండానే ముఖ్యామంత్రిగా జగన్ మూడేళ్ళ పాలన పూర్తి చేశారు. దాంతో అటు పార్టీలో ఏం జరుగుతుందో ఆయనకు పెద్దగా తెలియడంలేదు అన్న సన్నసన్నని అసంతృప్తి అయితే బయల్దేరింది. దాంతో గడప గడపకు మన ప్రభుత్వం పేరిట జరుగుతున్న కార్యక్రమాలతో ప్రజలకు సర్కార్ మీద ఉన్న భావన ఏమిటి అన్నది కూడా బాగానే వెల్లడైంది.

ఇక ఇంకో వైపు కార్యకర్తలలో సణుగుడు కూడా అధినాయకత్వం చెవిన సోకింది అంటున్నారు. ఇలా అనేక రాజకీయ పరిణామాల తరువాత ఎట్టకేలకు జగన్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. అది ఏంటి అంటే ఇక మీదట ఎమ్మెల్యేలకు దర్శనం ఇవ్వడం. వారి సాధకబాధకలు వెనడం, వాటికి పరిష్కారం చూడడం.

అదే విధంగా ప్రజలకు కూడా టైమ్ ఇచ్చి వారి సమస్యల పట్ల కూడా సత్వరమే స్పందించడం. దీని కోసం ప్రజా దర్బార్ అని పేరు పెట్టి ఒక వినూత్న కార్యక్రమానికి వైసీపీ అధినాయకత్వం శ్రీకారం చుట్టనుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్ట్ 15 నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది అని అంటున్నారు.

ప్రతీ రోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల ద్వాకా ప్రజా దర్బార్ సాగనుంది అని తెలుస్తోంది. అక్కడ వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. అంటే ఇప్పటికి సరిగ్గా నెల రోజుల తరువాత ప్రజా దర్బార్ అన్నది ఏపీలో స్టార్ట్ కాబోతోంది అన్న మాట.

ఒక విధంగా పార్టీకి అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి జనాలకు కనెక్షన్ కట్ అవుతోంది అని గ్రహించబట్టే ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఎంతో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ రావడమే కాకుండా మైలేజ్ కూడా దక్కుతుందని ఆశిస్తున్నారు.

అదే విధంగా ఎమ్మెల్యేలతో అసంతృప్తి పోగొట్టడానికి ఇప్పటికే నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. దాన్ని మరింత పెంచే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి ప్రజా దర్బార్ కధ ఏంటి, దాని సక్సెస్ రేటు ఎలా ఉంటుంది అనంది. ఇప్పటికి అయితే ఒక విషయం మాత్రం స్పష్టం అయింది. గ్రౌండ్ లెవెల్ లో సీన్ బాగా అర్ధమయ్యాకనే హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నదని.