Begin typing your search above and press return to search.

అడ్డంగా పెంచి.. తగ్గింపు పై అడ్డగోలు డిమాండ్లా? ఎంపీ మోపిదేవి

By:  Tupaki Desk   |   6 Nov 2021 11:31 AM GMT
అడ్డంగా పెంచి.. తగ్గింపు పై అడ్డగోలు డిమాండ్లా? ఎంపీ మోపిదేవి
X
పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఒకింత ఇరకాటంలో పెట్టింది. వ్యాట్ ను తగ్గించుకుని ధరలపై ప్రజాగ్రహాన్ని కొంతైనా చల్చార్చాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో స్పందించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు తమకు వీలైనంతగా వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయాలు ప్రకటించాయి. కానీ, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదు. ఫలితంగా కేంద్రం ప్రకటించిన తగ్గింపు లాభం ఈ రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు దీన్ని ఓ అంశంగా తీసుకుని విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఏపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఈ విమర్శలపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం అడ్డంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఏకపక్షంగా ఎక్సైజ్ సుంకం తగ్గించిందని.. ప్రజల్లో గందరగోళం రేపిందని అన్నారు. జాతీయ స్థాయిలో చర్చ జరిపిన తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పనిలో పనిగా.. వ్యాట్ తగ్గింపు విషయంలో అయా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పుకొచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అడగాల్సింది కేంద్రాన్ని అని.. ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కాదు.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కేంద్రం తగ్గించాల్సిన మోతాదులో తగ్గించాలన్న ఆయన.. అప్పుడు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ప్రత్యేక హోదాపై ఒకటే వైఖరి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఎంపీ మోపిదేవి డిమాండ్ చేశారు. ఇందుకోసం అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు విషయంలో పవన్ డెడ్ లైన్ పెట్టాల్సింది కేంద్రానికే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తామూ పోరాడుతున్న సంగతిని గుర్తుచేశారు.