Begin typing your search above and press return to search.

కొత్త మంత్రులు.. వారికిచ్చే శాఖలు రెఢీ అయ్యాయా?

By:  Tupaki Desk   |   21 July 2020 5:58 PM GMT
కొత్త మంత్రులు.. వారికిచ్చే శాఖలు రెఢీ అయ్యాయా?
X
ఇద్దరు మంత్రులను రాజ్యాసభకు పంపిన నేపథ్యంలో ఖాళీ అయిన వారి స్థానాల్ని భర్తీ చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి బుధవారాన్ని ముహుర్తంగా నిర్ణయించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఖాళీ స్థానాల్ని భర్తీ చేసే విషయంలో తాజాగా ఎంపిక చేసిన వైనాన్ని చూస్తే.. జగన్ మార్కు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల్ కు మంత్రి పదవి ఖరారైంది. గోదావరి జిల్లాలకు చెందిన పిల్లి స్థానంలో ఆయనకు చోటు లభించినట్లుగా చెప్పాలి.

మరో మంత్రి మోపిదేవి స్థానంలో మంత్రిగా అవకాశాన్నిసొంతం చేసుకున్నారు విజయనగరం జిల్లాకు చెందిన డాక్టర్ సిదిరి అప్పలరాజు. గుంటూరుజిల్లాకు చెందిన మంత్రి పదవిని ఉత్తరాంధ్రకు కేటాయించటం ఆసక్తికరంగా మారింది. తాజా ఎంపిక నేపథ్యంలో ఎమ్మెల్సీ భర్తీలో గుంటూరు జిల్లాకు ప్రాధాన్యత లభించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. తనకు సన్నిహితంగా వ్యవహించే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి స్థానం నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో.. పిల్లి స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ధర్మానకు చోటు లభించిందని చెప్పాలి.

పనిలో పనిగా.. మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారికి కేటాయించాల్సిన మంత్రిత్వ శాఖల విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న ధర్మాన కృష్ణదాస్ కు కీలకమైన రెవెన్యూ శాఖను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డాక్టర్ సిదిరి అప్పలరాజుకు మత్య్సశాఖను కేటాయిస్తారని.. మరో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వేణుగోపాల్ కు రహదారులు భవనాల శాఖను ఖరారు చేసినట్లుగా సమాచారం. మరీ.. అంచనాలు ఎంతమేర నిజమవుతాయన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.