Begin typing your search above and press return to search.

ఏపీ కొత్త రాజధాని గుంటూరు....?

By:  Tupaki Desk   |   26 March 2022 4:30 PM GMT
ఏపీ కొత్త రాజధాని గుంటూరు....?
X
ఏపీకి రాజధానిగా మరో సిటీ చేరింది. అదే గుంటూరు. నిజానికి గుంటూరే కదా ఇపుడు రాజధాని అని అంతా అనుకోవచ్చు. కానీ నిజం అది కాదు, గుంటూరుకి సరిగ్గా నలభై కిలోమీటర్ల దూరంలో అమరావతి పేరిట అపర సృష్టి జరిగింది. దానికి విశ్వామిత్రుడు నాటి సీఎం చంద్రబాబు.

అక్కడే ప్రపంచ రాజధాని నిర్మించాలని బాబు కలలు కన్నారు. ఆ విషయంలోనే ఎన్నో ఏళ్ళుగా ఇన్ని రకాల రచ్చలు వివాదాలు చెలరేగాయి. జగన్ మూడు రాజధానులు అనడం వెనక అసలు కారణం అమరావతి బాబు క్రియేషన్ కాబట్టే అని అంటారు.

దాంతో ఆయన పట్టుదలగా విశాఖ వైపు రావాలనుకున్నారు. కానీ అది ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. కోర్టు తీర్పు అయితే అమరావతికే అనుకూలంగా ఉంది. దీని మీద సుప్రీం కోర్టుకు వెళ్ళినా ఏం జరుగుతుందో ఎవరూ చెప్పరు.

దాంతో అసెంబ్లీ వేదికగా పాలనా వికేంద్రీకరణకు మేము అనుకూలమని గట్టిగా చెప్పుకున్నారు కానీ న్యాయపరమైన అడ్డంకుల నేపధ్యంలో అది కుదిరే పని కాదు. అందుకే జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని అంటున్నారు. ఏపీకి కొత్త రాజధానిగా గుంటూరు ని ప్రకటిస్తారని భోగట్టా. అక్కడ కూడా మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉనాయి కాబట్టి క్యాపిటల్ కళ వచ్చేస్తుంది.

అలా ప్రకటించడం ద్వారా బహుముఖమైన ప్రయోజనాలను జగన్ ఆశిస్తున్నారు. ముందు అర్జంటుగా అమరావతి విషయం మరుగున పడుతుంది. అదే టైం లో నిజానికి తమ ప్రాంతానికి రాజధాని వస్తుందని గుంటూరు వాసులూ ఆలోచించారు. కానీ అది అటూ ఇటూ కాకుండా ఏకంగా నలభై కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయింది.

ఇక విజయవాడ వాసులదీ అదే బాధ. ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటు అయినపుడు విజయవాడనే రాజధానిగా చేయమని నాటి నాయకులు పట్టుపట్టారు. అది కుదరలేదు. విభజన తరువాత అయినా కూడా తీరలేదు. దాంతో వారు కూడా రాజధాని బాధతో ఉన్నారు.

దాంతో విజయవాడ, గుంటూరు జిల్లాలలో అసంతృప్తి ఉంది. ఇపుడు దాన్ని జగన్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. గుంటూరుని రాజధానిగా చేసి విజయవాడతో కలిపి జంట నగరాలుగా తీర్చిదిద్దాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది.

దీనికి సంబంధించి అసెంబ్లీలో రెండు రోజుల క్రితం జరిగిన చర్చలో ఆయన హింట్ కూడా ఇచ్చారు అంటున్నారు. చంద్రబాబుకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే అయిదు వందల ఎకరాల భూములను సేకరించి గుంటూరు విజయవాడలలో రాజధాని ఎందుకు కట్టలేదని కూడా నిలదీశారు.

ఆ విధంగా ఈ రెండు ప్రాంతాల వారిని మచ్చిక చేసుకుంటూ అక్కడే కొత్త రాజధాని భవనాలు కట్టాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని వల్ల రాజధాని ఎక్కడికీ పోయింది అన్న బాధ ఎవరికీ ఉండదు, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక అమరావతి కధలు చెప్పుకోవడమే మిగులుతుంది.

మొత్తానికి జగన్ ప్లాన్ కి వైసీపీలో బాగా మద్దతు లభిస్తోందిట. ఎన్నికలలోగా జగన్ తన ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు అని అంటున్నారు. మరి విశాఖ, కర్నూల్ సంగతేంటి అంటే దానికి వైసీపీ నేతలు ఏమని జవాబు చెబుతారో చూడాలి.