Begin typing your search above and press return to search.

'మేం ఎన్నికల విధుల్లో పాల్గొనం'...అవసరమైతే కోర్టుకి పోతాం!

By:  Tupaki Desk   |   9 Jan 2021 7:58 AM GMT
మేం ఎన్నికల విధుల్లో పాల్గొనం...అవసరమైతే కోర్టుకి పోతాం!
X
ఏపీలో స్థానిక ఎన్నికల పోరు రచ్చ రచ్చగా మారుతుంది. కరోనా వైరస్ విజృంభణ కి ముందు జరగాల్సిన స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపాలని పట్టుబడుతుంటే ... ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కుదరదు అని చెప్తూ వస్తుంది. దీనితో ప్రభుత్వం - ఎస్ ఈసి మధ్య గత కొన్నిరోజులుగా పోరు నడుస్తుంది. ఇదిలా సాగుతుండగానే .. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌(ఎస్‌ ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే , ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. కరోనా స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. లేకపోతే ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలు దఫాలుగా ఎన్నికల కమీషనర్‌ కు తెలియజేశాం. సీఎస్ కూడా ఇదే విషయాన్ని ఆయనకు వివరించారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికం. తెలంగాణ - బిహార్‌ రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత కరోనా వ్యాపించింది. ఎన్నికల కమీషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనాతో భయబ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదు. 9లక్షల కు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ఎన్నికల విధులు బహిష్కరిస్తాం అని అన్నారు.

అలాగే ,నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేత సుధీర్‌ బాబు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ప్రభుత్వ అభ్యర్థనను నిమ్మగడ్డ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు.