Begin typing your search above and press return to search.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ 1 : సీఎం జగన్

By:  Tupaki Desk   |   21 Sept 2021 1:41 PM IST
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ 1 : సీఎం జగన్
X
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.

విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్‌- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్‌ ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.