Begin typing your search above and press return to search.

టీడీపీ మీద సానుభూతి పెరిగే ఈ చర్యలేంది? జగన్ గమనిస్తున్నారా?

By:  Tupaki Desk   |   25 May 2022 3:04 AM GMT
టీడీపీ మీద సానుభూతి పెరిగే ఈ చర్యలేంది? జగన్ గమనిస్తున్నారా?
X
దేన్ని తెగే వరకు లాగకూడదంటారు. ఈ చిన్న విషయాన్ని ఏపీ అధికారపక్షం ఎలా మిస్ అవుతోంది? ఇప్పటికే విపక్షాలపై విరుచుకుపడుతున్నారంటూ ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్న వేళ.. దాన్ని మరింత పెంచేలా ఏపీ అధికార పక్ష నేతల నిర్ణయాలు ఉంటున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వాటి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సలహాలు.. సూచనలు తీసుకొని చేస్తున్నారా? లేదంటే పవర్ చేతిలో ఉన్నోళ్లు వెనుకా ముందు ఆలోచించకుండా ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకల్ని మహానాడు పేరుతో నిర్వహించటం ఏపీ విపక్ష టీడీపీకి అలవాటన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఏడాది అదే విధంగా ఒంగోలులో భారీ ఎత్తున మహానాడును నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా మహానాడుకు వచ్చేందుకు వీలుగా.. స్కూలు బస్సుల్ని.. ఆర్టీసీ బస్సుల్ని వాడుకోవాలని నిర్ణయించారు.

అయితే.. మహానాడుకు వెళ్లేందుకు స్కూల్ బస్సుల్ని టీడీపీ నేతలకు ఇస్తే చర్యలు తప్పవన్న హెచ్చరికలు రవాణా శాఖ అధికారుల నుంచి రావటంతో.. ఎవరూ తమ బస్సుల్ని ఇవ్వటానికి సిద్ధంగా లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మహానాడుకు ఆర్టీసీ బస్సుల్ని అద్దెకు తీసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. అయితే.. అనూహ్యంగా మహానాడుకు అద్దె బస్సుల్ని బుక్ చేసుకోకుండా ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటున్న వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి.. బస్సుల్ని అద్దెకు అడుగుతుంటే.. అధికారులు ముఖం చాటేయటం.. సమాధానం చెప్పకుండా ఉండటం ఏ మాత్రం సరికాదంటున్నారు.

వ్యాపారం వ్యాపారమే.. రాజకీయం రాజకీయమే. టీడీపీ నేతలకు అధికార పార్టీ మీడియాకు చెందిన పత్రికల్ని వేయకుండా ఆపుతారా? అదెలాంటి తలతిక్కల పనో.. ఇప్పుడు అద్దె బస్సుల్ని అద్దెకు ఇవ్వకుండా ఉండటం టీడీపీ మీద ప్రజల్లో సానుభూతి పెరిగే అవకాశం ఉందంటున్నారు.

గతంలో మహానాడుకు అద్దె బస్సుల్ని బుక్ చేసుకునేందుకు ఓకే చెప్పిన ఆర్టీసీ అదికారులు ఇప్పుడు మాత్రం వేసవి రద్దీ పేరుతో బస్సులు అద్దెకు ఇవ్వలేమంటూ అధికారులు ముఖం చాటేసిన వైనం వెనుక అసలు కథమిటో అందరికి తెలిసిందేనన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి చర్యలు విపక్షంపై ప్రజల్లో సానుభూతి పెంచేలా చేయటమే కాదు.. అధికార పక్షం ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? వీటికి సీఎం జగన్ ఆమోదముద్ర ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.