Begin typing your search above and press return to search.

ఏపీ అంబులెన్స్ ల నిలిపివేత: కేసీఆర్ పై ఏపీ విపక్షాల ఫైర్

By:  Tupaki Desk   |   14 May 2021 10:35 AM GMT
ఏపీ అంబులెన్స్ ల నిలిపివేత: కేసీఆర్ పై ఏపీ విపక్షాల ఫైర్
X
కరోనా కల్లోలం వేళ ఏపీ నుంచి వస్తున్న రోగులను సరిహద్దుల్లోనే ఆపుతున్న తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టులోనూ, ఏపీ ప్రజల్లోనూ తీవ్ర ఆక్షేపణ వ్యక్తమైన సంగతి తెలిసిందే. మానవత్వం మరిచి ఇలా వ్యవహరిస్తారా? అని హైకోర్టు సైతం మందలించింది. తాజాగా ఏపీ సరిహద్దుల్లో మరోసారి తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లు నిలిపేస్తుండడంపై ఏపీ విపక్షాలు మండిపడుతున్నాయి.

తెలంగాణ పోలీసులు ఈరోజు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్ లను అడ్డుకున్నారు. కోవిడ్ రోగులు ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారని తెలిసినా తమ కర్కశత్వం చూపించారు. ఆస్పత్రులకు వెళ్లేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపినా పోలీసులు మాత్రం వారిని పంపించడం లేదు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ అనుమతి కూడా ఉండాలని మరోసారి అంబులెన్స్ డ్రైవర్లకు చెప్పి నిలిపివేవారు. దీంతో రోగులు సరిహద్దుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇక అంబులెన్స్ లు ఆపడంపై ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. సీఎంలు కేసీఆర్, జగన్ లు స్పందించాలని టీడీపీ డిమాండ్ చేసింది. కోర్టులు చెప్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దౌర్భాగ్యమని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశాడు.

ఇక హైదరాబాద్ లో సెక్షన్ 8 చట్టాన్ని కేసీఆర్ సర్కార్ కాలరాస్తోందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు ఏపీ ప్రజలను రెండోతరగతి ప్రజలుగా చూస్తున్నారని.. ఓ మనిషి పుట్టిన ప్రాంతాన్ని వ్యత్యాసం చూపించడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని విష్ణఉ అన్నారు. ఏపీ రోగుల మరణానికి కారణమవుతున్న వారిపై ఏపీ సర్కార్ కేసులు నమోదు చేయాలని సూచించారు.