Begin typing your search above and press return to search.

పంచాయతీలలో వైసీపీ గెలిచింది ఇంత తక్కువనా? అది ఎలా?

By:  Tupaki Desk   |   9 March 2021 7:30 AM GMT
పంచాయతీలలో వైసీపీ గెలిచింది ఇంత తక్కువనా? అది ఎలా?
X
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు కాకరేపాయి. అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.. అయితే పార్టీల గుర్తు కాకపోవడంతో ఎవరు ఎన్ని గెలిచారన్నది చెప్పడం కష్టమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ ఉందని, అందుకే తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని వైసీపీ నాయకులు అంటున్నారు. అటు ప్రతిపక్ష టీడీపీ అధికారంలో లేకున్నా చాలా చోట్ల జెండా ఎగురవేసిందని, దీంతో జగన్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని అంటున్నారు. ఇక బీజేపీ, జనసేనలు సైతం తమ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయని చెబుతున్నాయి. అయితే వైసీపీలో కేవలం 25 శాతం మంది మాత్రమే నిజంగా గెలిచిన వారున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు సన్నిహితుల వద్ద కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనవు. పోటీలో నిలబడే అభ్యర్థలకు మద్దతు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఆయా గ్రామాలను ఏకగ్రీవాలు చేసేందుకు యత్నించింది. కానీ కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుండా బరిలో నిలబడ్డారు. దీంతో పోటీ అనివార్యమై ఎన్నికలు జరిగాయి. మరోవైపు ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేయడంతో ఆయా గ్రామాల్లో పోటీకే సై అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో వైపీపీకి పట్టున్న కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కేవలం 25 శాతం మాత్రమే పార్టీ మద్దతు దారులు గెలిచారని సమాచారం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆయా జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంటే గిట్టని వాళ్లు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. పార్టీ కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్న వారికి టికెట్లు దక్కకపోవడంతో వారంతా తమ దగ్గరి వ్యక్తులకు మద్దతు ఇచ్చారు. ఇక చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.

ఆ నాలుగు జిల్లాల్లో చాలా వరకు వైసీపీ రెబల్ గా ఉన్నవాళ్లే గెలిచారు. అయితే వారు గెలిచిన తరువాత అభ్యర్థులను పిలిపించుకొని వారికి వైసీపీ కండువాలు వేసి ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను అధిష్టానానికి పంపి తమ అభ్యర్థులే గెలిచారని డబ్బా కొట్టుకున్నారని ఓ రెబల్ అభ్యర్థి బాహటంగానే చెప్పారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ 25 శాతం మాత్రమే గెలిచిందని, మిగతా వారంతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారేనని అనుకుంటున్నారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు వాపోతున్నారు.