Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ సార‌థి మార‌నున్నారా? మాజీ సీఎంపైనే అందరి దృష్టి!

By:  Tupaki Desk   |   31 July 2021 11:30 PM GMT
ఏపీ కాంగ్రెస్ సార‌థి మార‌నున్నారా?  మాజీ సీఎంపైనే అందరి దృష్టి!
X
ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌తో.. ఏపీలో తీవ్రంగా దెబ్బ‌తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఇంకా గాడిలో ప‌డ‌లేదు. ఇప్ప‌టికి రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగినప్ప‌టికీ.. ఒక్క ఎన్నిక‌లోనూ క‌నీసం ఒక్క అబ్య‌ర్థిని కూడా నెగ్గించుకోలేక పోయారు. ఇక, ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ ఎక్క‌డా విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. మ‌రి అప్ప‌టికైనా అంటే.. విభ‌జ‌న త‌ర్వాత‌.. వ‌చ్చే మూడో ఎన్నిక‌లో అయినా.. కాంగ్రెస్ పుంజుకుంటుందా? అంటే.. ప్ర‌స్తుతం ఉన్న‌ ప‌రిస్థితిలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. గ‌త 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ సార‌ధిగా ఉన్న ర‌ఘువీరారెడ్డి.. రాజీనామా స‌మ‌ర్పించారు. అంతేకాదు.. ప్ర‌త్యక్ష రాజ‌కీయాల‌కు కూడా ఆయ‌న దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సాకే శైల‌జానాథ్‌ను నియ‌మించారు. ఉన్న‌త విద్యావంతుడే అయిన‌ప్ప‌టికీ.. గ‌ళం వినిపించ‌డంలోను.. మాస్ రాజ‌కీయాలు చేయ‌డంలోను సాకే వెనుక‌బ‌డ్డారు. అంతేకాదు.. పార్టీకి త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కుల‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చ‌డంలోనూ ఆయ‌న స‌క్సెస్ కాలేక పోయారు.

ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ప‌రిస్థితి జారుడు మెట్ల‌పై చేస్తున్న భ‌విష్య‌త్ పోరాటంగానే ఉంద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు అధికార పార్టీ దూకుడు.. మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాలు.. వంటి వాటికి దీటుగా .. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ప్ప‌టికీ.. ఆదిశ‌గా సాకే చేసిన ప్ర‌యోగాలు ఏమీలేవు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. ఈ క్ర‌మంలో కొన్నాళ్లుగా ఏపీపై దృష్టిపెట్టిన అధిష్టానం.. ఇక్క‌డ మార్పు కోసం త‌హ‌త‌హ‌లాడుతోంది.

ఇదే విష‌యాన్ని.. పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ చెబుతున్నారు. పార్టీ ఏపీ చీఫ్‌ను మార్చా లని.. అధిష్టానం నిర్ణ‌యించింద‌న్న చాందీ.. త్యాగాల‌కు రెడీగా ఉండాల‌ని మాన‌సికంగా.. నేత‌ల‌ను సిద్ధం చేశారు. దీంతో ఇక‌, పీసీసీ చీఫ్ ప‌ద‌వికి కొత్త నేత‌ను ఎంచుకునేందుకు రెడీ అయిన విష‌యం.. కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ర‌హ‌స్య మంత‌నాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా.. ఇక్క‌డ ఆ ప‌ద‌వి కోసం.. కొట్టుకునేవారు.. కుమ్ముకునేవారు ఎవ‌రూ లేక‌పోవ‌డం అధిష్టానానికి క‌లిసివ‌స్తున్న ప‌రిణామం.

ఇక‌, పీసీసీ చీఫ్ వేట‌లో కాంగ్రెస్ ఇద్ద‌రి నుంచి ముగ్గురివైపు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. వీరిలో కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లంరాజు, ప్ర‌స్తుతం పార్టీకి దూరంగా ఉన్న ర‌ఘువీరారెడ్డి, అదేస‌మ‌యంలో వీరిద్దరి కంటే ఎక్కువ‌గా.. మాజీ ముఖ్య‌మంత్రి, అందరినీ క‌లుపుకొనిపోతార‌నే పేరున్న‌.. నాయ‌కుడు, మంచి దూర దృష్టి ఉన్న నేత‌.. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి అయితే.. బాగుంటుంద‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రాన్ని విడ‌గొట్టింద‌నే కార‌ణంగా.. కాంగ్రెస్‌కు ఆయ‌న కొన్నాళ్లు దూరంగా ఉండి సొంత పార్టీ పెట్టుకున్నారు.

అయితే.. సొంత పార్టీ కిర‌ణ్‌కుమార్‌కు క‌లిసిరాలేదు. దీంతో ఆయ‌న కొన్నాళ్ల కింద‌టే మ‌ళ్లీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద ప‌ద‌వి ఏమీలేదు. దీంతో ప్ర‌స్తుతం ఏపీ ఉన్న ప‌రిస్థితిలో మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. బెట‌ర్ అనే మాట వినిపిస్తోంది. వైసీపీని బ‌లంగా ఎదుర్కొని.. పార్టీని న‌డిపించాలంటే.. కిర‌ణ్ వంటివారు అయితే.. మెరుగైన ఫ‌లితం వ‌స్తుంద‌నేది కాంగ్రెస్ అధిష్టానం టాక్. మరి కిరణ్ ఏం చేస్తార‌నేది చూడాలి.