Begin typing your search above and press return to search.

0.84 శాతం ఓట్లకే అంత మిడిసిపాటా!

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:35 AM GMT
0.84 శాతం ఓట్లకే అంత మిడిసిపాటా!
X
భారతీయ జనతా పార్టీ నేతల మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం విషయంలో వారి మాటలు ప్రజల్లో అసహనాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. తాము బీజేపీని పూర్తిగా తిరస్కరించినా రాష్ట్రంపై సర్వాధికారాలూ తమవే అన్నట్టుగా బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లతో ప్రజలు విస్తుపోతూ ఉన్నారు.

ఇటీవలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఏపీ ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఆ పార్టీకి ఏపీలో ఉన్న స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ‘నోటా’ కన్నా తక్కువ ఓట్లను పొందింది భారతీయ జనతా పార్టీ.

మోడీ ఇమేజ్, కేంద్రంలో అధికారంలో ఉండటం, జాతీయవాదం.. హిందుత్వ వాదం అన్నింటినీ వాడినా ఏపీలో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఓట్ల శాతం కేవలం 0.84 మాత్రమే.

నంబర్ గా చెప్పాలంటే.. ఏపీలో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఓట్లు అక్షరాలా రెండు లక్షలా ముప్పై ఆరు వేల చిల్లర ఓట్లు. రాష్ట్రమంతా కలుపుకుని భారతీయ జనతా పార్టీ ఈ ఓట్లను సంపాదించుకుంది.

అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెట్టి, మోడీ-అమిత్ షాలు కూడా స్వయంగా ఏపీకి వచ్చి ప్రచారం చేయగా.. కమలం పార్టీకి వచ్చిన ఓట్లు అవి. మరి ఆ మాత్రం దానికే భారతీయ జనతా పార్టీ వాళ్లు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఏపీలో భవిష్యత్తు అంతా తమదే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.

కనీసం ఒక్క శాతం ఓట్లను సంపాదించలేకపోయిన జాతీయ పార్టీ, నోటా కన్నా తక్కువ ఓట్లను పొందిన పార్టీ అలా వ్యవహరించడం విడ్డూరంగా మారింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కు ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి కూడా. ఎంత చిత్తు అయినా కాంగ్రెస్ పార్టీనే బీజేపీ కన్నా ఏపీలో బెటర్ పొజిషన్లో కనిపిస్తోంది.

ఇక కమలనాథులు కేంద్రంలో అధికారాన్ని కలిగి ఉండి కూడా రాష్ట్రానికి ఇచ్చిన ఎన్నికల హామీలను కూడా నిలుపుకోలేకపోతూ ఉన్నారు. అలా రాష్ట్రానికీ ఏం సాయం చేయకుండా, కమలం పార్టీ వాళ్లు చెబుతున్న కహానీలు మాత్రం కామెడీగా మారుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.