Begin typing your search above and press return to search.

ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ.. బీజేపీ వింత డిమాండ్!

By:  Tupaki Desk   |   28 April 2021 5:30 AM GMT
ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ.. బీజేపీ వింత డిమాండ్!
X
నవ్విపోదరుగాక నాకేటి సిగ్గు అన్నట్టు రాజకీయ పక్షాలు వ్యవహరిస్తుంటాయన్న విమర్శలు ఉన్నాయి. తనది కాకపోతే ఏమైనా చేయొచ్చని పార్టీలు భావిస్తుంటాయి. ఇప్పుడు ఏపీ బీజేపీ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోందని అంటున్నారు.

ఓపక్క మోడీ ఉండే దేశ రాజధాని ఢిల్లీ శవాల దిబ్బగా మారుతోంది. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో శవాలు శ్మశానాల్లో క్యూలో ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో అయితే లాక్ డౌన్ పెట్టేశారు. అయితే అలాంటి పరిస్థితులు లేని ఏపీలో మాత్రం హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేయడం చూసి ఇప్పుడు అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ముందు దేశాన్ని మీ రాష్ట్రాలను సరిచేసి ఏపీ పై పడండి అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ప్రపంచమంతా కోవిడ్ 19 సెకండ్ వేవ్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ముఖ్యంగా భారతదేశం చావుదెబ్బతింటోంది. బీజేపీ నాయకుల చర్యలు, చేష్టలు మాత్రం నవ్వుల పాలవుతున్నాయన్న విమర్శ ఉంది.

మొదటి వేవ్ ను జయించిన బీజేపీ సర్కార్ రెండో వేవ్ కరోనాను నియంత్రించడంలో విఫలమైందని ప్రతిపక్షాలు కేంద్రంలోని బిజెపిని నిందిస్తున్నాయి. ఆ తప్పును ఎలా కవర్ చేసుకోవాలో తెలియని ఏపీలోని బిజెపి నాయకులు... ఏపీలోని ప్రభుత్వంలో తప్పును కనుగొనడానికి ప్రయత్నిస్తుండడం విశేషం. జగన్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైనందున రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పెట్టాలని ఏపీ బిజెపి నాయకులు డిమాండ్ చేయడం విశేషం.

నైట్ కర్ఫ్యూను తుగ్లక్ నిర్ణయం అని బిజెపి సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి దశలో ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్టు కొవ్వొత్తి వెలిగించడం, వరండాలో చప్పట్లు కొట్టడం వంటి చర్యలు చేపట్టాలని విష్ణు సెలవిచ్చాడు.

కోవిడ్ 19 రోగులకు వ్యాక్సిన్.. ఆక్సిజన్ సరఫరా చేయడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకి విష్ణుకుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యాక్సిన్లను రెట్టింపు ధరకు రాష్ట్రాలకు ఇవ్వడంపై ఇప్పటికే బిజెపిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 ఎలా ఇస్తారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బిజెపి నాయకులు ఏదైనా మాట్లాడటానికి ముందు కనీసం కోవిడ్ 19 నిర్వహణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఒక్కసారి ఆత్మవలోకనం చేసుకోవాలని.. ఆ తర్వాత ఏపీ గురించి మాట్లాడాలని పలువురు హితవు పలుకుతున్నారు.