Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలు నడవాలి.. పరీక్షలు మాత్రం వద్దా బాబు?

By:  Tupaki Desk   |   29 April 2021 8:31 AM GMT
పవన్ సినిమాలు నడవాలి.. పరీక్షలు మాత్రం వద్దా బాబు?
X
ఏపీలో ఓ వైపు కరోనా కేసులు 10 వేలకు పైగానే నమోదవుతున్నాయి. ప్రతిరోజు 50కి పైగానే కరోనాతో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విద్యార్థులకు పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని అంటున్నారు. కరోనా కారణంగా విద్యార్థులు ఓ సంవత్సరం కోల్పోవడం తనకు ఇష్టం లేదని, అందువల్ల కరోనా నిబంధనలతో, బాధ్యతాయుతంగా పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అయితే టీడీపీ మాత్రం విద్యార్థుల భవిష్యత్ కంటే ఆరోగ్యం ముఖ్యమని, పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే పవన్ కల్యాన్ ‘వకీల్ సాబ్’సినిమా బెన్ఫిట్ షోల రద్దుపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు ఇప్పుడు విద్యార్థుల ఆరోగ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలంటున్నారు.

ఈనెల 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పవన్ కల్యాన్ సినిమా ‘వకీల్ సాబ్’ విడుదలయింది. అయితే ఏపీలో మాత్రం థియేటర్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బెన్ఫిట్ షోలకు అవకాశం ఇవ్వలేదు. వాటిని రద్దు చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ షోలకు అధికంగా ప్రేక్షకులు వస్తున్నందున వాటిని రద్దు చేసిందని అన్నారు. అయితే ఈ షోల టికెట్ రేటు రూ.6 వేలకు అమ్ముతున్నారన్న ఫిర్యాదుపై కూడా షోలను రద్దు చేశారని చెప్పారు. అయితే ఈ సమయంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా చంద్రబాబు నిలిచారు.

రాజకీయంగా పవన్ ను ఎదుర్కోలేని జగన్.. ఇలా సినిమాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకే బెన్ఫిట్ షో లను రద్దు చేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల కింద రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ పట్టుబట్టగా వైసీపీ ప్రభుత్వం మాత్రం కరోనా ఉధృతి ఇంకా తొలిగిపోనందున ఎన్నికలు వద్దని చెప్పింది. ఆ సమయంలో చంద్రబాబు ఈసీకి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతుందని ఆరోపించారు.

ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ విద్యార్థుల పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులందరినీ పాస్ చేయిస్తే వారికి భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వారి సర్టిఫికెట్లలో పాస్ అని ఉండడం వల్ల వారి నైపుణ్యంపై ప్రభావం పడుతుందన్నారు. అందుకే నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

కానీ ప్రతిపక్ష చంద్రబాబు మాత్రం విద్యార్థుల పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాన్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం పోరాడిన చంద్రబాబు ఇప్పుడు వాయిదా వేయాలని ఎలా అంటున్నాడని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో పవన్ మద్దతు కూడగట్టేందుకే ఇలా చేశాడా..? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.