Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లు.. లోక్ సభ స్పీకర్ వారి మాట విన్నారా?

By:  Tupaki Desk   |   14 Dec 2022 5:01 AM GMT
ఆంధ్రోళ్లు.. లోక్ సభ స్పీకర్ వారి మాట విన్నారా?
X
ఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజన చేయటం తెలిసిందే. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నది తెలిసిందే. మెజార్టీ అభిప్రాయానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే ప్రజాస్వామ్య పద్దతిలో చూసినప్పుడు ఎక్కువ మంది ఉన్న ఏపీ ప్రజల డిమాండ్ తో పోలిస్తే.. జనాభా పరంగా తక్కువగా ఉన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను అంగీకరించటం వెనుక రాజకీయ కారణంతో పాటు.. తమ ప్రాణాల్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించటం కోసం పెద్ద ఎత్తున బలిదానాల రూపంలో ఇవ్వటంతో నాటి యూపీఏ సర్కారు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత జరిగినదానిని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ విషయాలన్ని అందరూ చూస్తున్నవే. అందరికి తెలిసిందే. అలాంటప్పుడు ఎనిమిదేళ్ల క్రితం జరిగిపోయిన విభజనను మళ్లీ ఎందుకు ప్రస్తావించటం అన్న సందేహం రావొచ్చు. దానికి కారణం లేకపోలేదు. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఎప్పటి మాదిరే ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని లోక్ సభలో లేవనెత్తిన వేళ.. స్పీకర్ స్పందిస్తూ.. 'అసలు మీకు ఆ వాగ్దానం ఎవరు చేశారు?' అని ప్రశ్నిస్తూ అందరికి షాకిచ్చారు.

సభాపతి స్థానంలో ఉన్న పెద్ద మనిషికి.. ఏపీ రాష్ట్ర విభజన.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల మీద అవగాహన లేదా? ఒకవేళ లేని పక్షంలో.. తరచూ ప్రస్తావించే ప్రత్యేక హోదా అంశం వెనుకున్న కారణం ఏమిటన్న విషయాన్ని ఆయన ఆరా తీస్తే.. ఐదు నిమిషాల్లో ఆయనకు అర్థమయ్యేలా వాస్తవాల్ని చెప్పేసేవారు కదా? అలాంటిదేమీ లేకుండా కోట్లాది మంది మనోభావాలు గాయపడేలా ఆయన ఎలా మాట్లాడతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయటంలో ఏపీ విభజన కీలక భూమిక పోషించిందన్నది కాదనలేని నిజం. ప్రత్యేక హోదా వాగ్దానాన్ని మీకు ఇచ్చిందెవరు? అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. నాటి సభలో ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాట.. దానికి నాటి సభలో వెంకయ్యనాయుడు చేసిన ప్రతి వ్యాఖ్యను ఓం బిర్లాకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేనా.. 2014 ఎన్నికల సమయంలో ఏపీ పర్యటనలో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా మీద ఇచ్చిన బహిరంగ హామీని వీడియో క్లిప్పుల రూపంలో ఓం బిర్లాకు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఏపీ ప్రజల్లో ఎవరూ కూడా స్పీకర్ చేసిన వ్యాఖ్యకు సమాధానంగా రియాక్టు అయ్యింది లేదు.

స్పీకర్ కు తెలిసేలా కనీసం సోషల్ మీడియాలో అయినా.. నాటి విషయాల్నిప్రస్తావిస్తూ పోస్టుల మీద పోస్టులు.. వీడియోలను అదే పనిగా షేర్ చేసి..ట్రెండింగ్ లో నిలిపి ఉంటే.. మరోసారి ప్రత్యేక హోదా గురించి ఎవరు హామీ ఇచ్చారన్న మాట వచ్చేది కాదు. ఒక రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు అవకాశం ఉన్న కీలక హామీ గురించి అత్యంత కీలక స్థానాల్లో ఉన్న వారు మర్చిపోతున్న వేళ.. వారందరికి అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రజల మీద లేదా? అన్నది ప్రశ్న. మరి..లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారంటారు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.