Begin typing your search above and press return to search.

సీబీఐపైనే ఏపీ పోలీసుల కేసు.. హైకోర్టు ఏం చెప్ప‌నుంది?

By:  Tupaki Desk   |   3 Aug 2022 6:54 AM GMT
సీబీఐపైనే ఏపీ పోలీసుల కేసు.. హైకోర్టు ఏం చెప్ప‌నుంది?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు జ‌రిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపైన అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్సార్సీపీ మ‌ధ్య తీవ్ర విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. టీడీపీయే చంపించింద‌ని జ‌గ‌న్, కాదు జ‌గ‌నే చంపించి ఆ నెపాన్ని త‌మ‌పై వేస్తున్నాడ‌ని టీడీపీ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకున్నారు. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ దీనిపై సీబీఐ విచార‌ణ కావాల‌ని కోరారు.

అయితే ఆ త‌ర్వాత ఎన్నిక‌లు ముగిసి జ‌గ‌న్ అధికారంలోకి రాగానే సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌ని.. రాష్ట్ర పోలీసులే ఈ కేసును విచారిస్తార‌ని జ‌గ‌న్ మాట మ‌డతేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్ర‌యించి సీబీఐ విచార‌ణ కోర‌డం.. హైకోర్టు అందుకు అంగీక‌రించ‌డం జ‌రిగిపోయాయి.

అప్ప‌టి నుంచి సీబీఐ వివేకా హ‌త్య కేసును విచారిస్తోంది. అయితే సీబీఐ అధికారుల‌ను బెదిరించ‌డం, కేసును వ‌దిలేయాల‌ని హెచ్చ‌రించ‌డం వంటివి చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌ధ్య‌లో చాలామంది అధికారులు కూడా మారిపోయాయి. అయితే సీబీఐపై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా అది త‌న ప‌ని తాను చేసుకుపోతోంది.

అయితే ఇలా లాభం లేద‌ని సీబీఐ కావాలనే బెదిరించి త‌ప్పుడు వాంగూల్మాలు ఇప్పించింద‌ని ప‌లువురితో సీబీఐ అధికారుల‌పైన పోలీసుల‌తో కేసులు పెట్టించారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ బెదిరించ‌డం వ‌ల్లే తాము వాంగూల్మం ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని పోలీసుల‌కు ఉద‌య్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. అలాగే ఒక‌రిద్ద‌రు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు సీబీఐపై కేసు న‌మోదు చేశారు.

తప్పుడు సాక్ష్యాల కోసం నిందితుల్ని సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నారంటూ పోలీసులు గతంలో పెట్టిన కేసుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఆగ‌స్టు 3న ఈ వ్య‌వ‌హారంపై పూర్తిస్దాయిలో విచారణ జరిపి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

కాగా వైఎస్ వివేకా హ‌త్య కేసులో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి, సునీల్ యాద‌వ్, త‌దిత‌రుల‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. వారి బెయిల్ పిటిష‌న్ల‌ను ఏపీ హైకోర్టు ఆగ‌స్టు 2 కొట్టివేసింది. ఈ నేప‌థ్యంలో పోలీసులు సీబీఐపై పెట్టిన కేసుల వ్య‌వ‌హారంలో హైకోర్టు తాజాగా ఏ తీర్పు ఇవ్వ‌నుంద‌నే దానిపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.