Begin typing your search above and press return to search.

కురుక్షేత్రం.. ర‌ణ‌రంగ‌మే అయ్యింది

By:  Tupaki Desk   |   8 July 2017 4:47 AM GMT
కురుక్షేత్రం.. ర‌ణ‌రంగ‌మే అయ్యింది
X
కురుక్షేత్రం పేరిట ఎమ్మార్పీఎస్ నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టిన కురుక్షేత్రం ర‌ణ‌రంగంగా మారింది. ఈ స‌భ‌ను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును.. ఎమ్మార్పీఎస్ అభిమానులు.. సానుభూతిప‌రులు తీవ్రంగా వ్య‌తిరేకించ‌ట‌మేకాదు.. భారీగా ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. నిఘా వ‌ర్గాల అంచ‌నా లోపంతో కురుక్షేత్ర స‌భ‌ను అడ్డుకునే ఎపిసోడ్ ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.

గుంటూరులోని నాగార్జున వ‌ర్సిటీ ద‌గ్గ‌ర ఏర్పాటు చేయాల‌ని భావించిన కురుక్షేత్రం స‌భ‌ను పోలీసులు అడ్డుకున్న తీరు మీద తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. దీంతో గుర్తు తెలియ‌ని ప‌లువురు ఆందోళ‌న‌ల్ని చేయ‌ట‌మే కాదు.. త‌మ ఆగ్ర‌హావేశాల్ని వ్య‌క్తం చేశారు. కురుక్షేత్రం ప్రాంగ‌ణానికి కూత‌వేటు దూరంలో ఉన్న కంతేరు అడ్డ‌రోడ్డు వ‌ద్ద పోలీసు వాహ‌నాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నిప్పు పెట్టారు. అయితే.. ఈ ప‌ని ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లే చేసి ఉంటార‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు.

కురుక్షేత్రాన్ని ఏపీ పోలీసులు అడ్డుకోవ‌టంతో ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌న్నీ ఉద్రిక్త‌త‌తో ఊగిపోయాయి. గుంటూరుకు బ‌య‌లుదేరిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం కార‌ణంగా ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతాల‌న్నీ ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించాయి. ఎమ్మార్పీఎస్ నిర్వ‌హిస్తున్న స‌భ‌కు వ‌స్తున్న వారిని పోలీసులు అడ్డుకోవ‌టంతో కృష్ణా జిల్లా జ‌గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు ఆర్టీఏ చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర‌పోలీసుల తీరును నిర‌సిస్తూ చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మం కార‌ణంగా దాదాపు 20 కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. తీవ్ర‌మైన ట్రాఫిక్ జాంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు.

కురుక్షేత్ర స‌భ‌ను అడ్డుకున్న పోలీసుల తీరును నిరసిస్తూ.. కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టిన ఆందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మేకాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాల‌తో పాటు.. పాట‌ల‌తో హోరెత్తించారు. తీవ్ర ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఆందోళ‌నాకారుల్ని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయ‌టం ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. ఈ సంద‌ర్భంగా ఆందోళ‌నాకారులు పోలీసుల మీద రాళ్లు రువ్వారు. తొమ్మిది లారీలు.. నాలుగు బ‌స్సులు.. ఒక కారు అద్దాల్ని ప‌గుల‌గొట్టారు. కొంద‌రు పెట్రోల్ సీసాల‌తో ఆందోళ‌న‌ల్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మొత్తంగా కురుక్షేత్రం స‌భతో ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతాలు తీవ్ర ఉద్రిక‌త్త‌తో ఊగిపోయాయి. ఆందోళ‌న‌కారుల ఆందోళ‌న‌లు పోలీసుల‌కు చుక్క‌లు చూపించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.