Begin typing your search above and press return to search.

కట్టలు తెగిన కర్కసత్వం: రోజా కంట కన్నీరు

By:  Tupaki Desk   |   11 Feb 2017 11:30 AM GMT
కట్టలు తెగిన కర్కసత్వం: రోజా కంట కన్నీరు
X
జగన్ పార్టీ రోజాకు దారుణమైన అవమానం జరిగిందా? అంతకు మించిన రీతిలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారా? అన్న సందేహాలకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు అవునని చెబుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లటం.. అనంతరం ఆమెను ఒంగోలు వైపుగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. రోజాను కారులో ఎక్కించే క్రమంలోనూ.. మార్గమధ్యంలోనూ ఆమె పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా కంట పడకుండా ఎయిర్ పోర్ట్ వెనుక ద్వారం గుండా తరలించిన పోలీసులు..గుంటూరు జిల్లా మేడికొండూరు దాటిన తర్వాత ఆమె ఫోన్ సిగ్నల్స్ కు అందకపోవటం ఒకింత ఆందోళనకు గురి చేసింది.

ఇదే సమయంలో..పేరేచర్ల జంక్షన్ వద్ద పోలీసులు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్నారు. ఒకచోట రోజా పెద్దగా కేకలు పెట్టారని.. రక్షణ కోసం పోలీసుల వాహనం నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయారని.. ఖాకీల దుశ్చర్యకు కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు తరలించే సమయంలో.. ఆమెను హోటల్ కు తీసుకెళుతున్నట్లుగా నమ్మబలికిన పోలీసులు.. ఆ తర్వాత అందుకు భిన్నంగా తీసుకెళ్లటం గమనార్హం. ఇదే విషయాన్నిన అడిగినప్పుడు మేడికొండూరు తీసుకెళుతున్నట్లుగా చెప్పినప్పటికీ.. అందుకుభిన్నంగా సత్తెనపల్లి వైపు తీసుకెళుతున్న వైనాన్ని గుర్తించారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దాదాపు 90 కిలోమీటర్ల మేర ఒక మహిళా ఎమ్మెల్యేను ఎందుకు తీసుకెళ్లారన్న ప్రశ్నకు సమాధానం లభించలేని పరిస్థితి.

ఒక మహిళా ఎమ్మెల్యే విషయంలోనే పోలీసులు ఇంత కరకుగా వ్యవహరిస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న మాట చెబుతున్నప్పటికీ..అదంతా ఉత్త మాటలేనన్న విషయం రోజా ఇష్యూలో తేలిపోయిందని చెప్పకతప్పదు. ఈ వ్యవహారంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నా.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. దీనిపై ఏపీ పోలీసులు వెంటనే స్పందించి.. వివరణ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.