Begin typing your search above and press return to search.

లోకేష్ ని హీరో చేసే ప్రయత్నంలో ఏపీ పోలీసులు సక్సెస్

By:  Tupaki Desk   |   22 Aug 2022 6:30 AM GMT
లోకేష్ ని హీరో చేసే ప్రయత్నంలో ఏపీ పోలీసులు సక్సెస్
X
న‌న్ను మాట్లాడ‌నివ్వండి.. మీరు ఇచ్చిన నోటీసులు చ‌దివాను.. మీరు మ‌రీ ! హ‌ద్దు మీరి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నేనొక శాసన స‌భ్యుడ్ని.. మీరు ఇచ్చిన నోటీసుల్లో ఏముందో పూర్తిగా అర్థం చేసుకున్నాను. అయినా రోడ్డు మీద ఓ గౌర‌వ శాస‌న స‌భ్యుడ్ని అవ‌మానించ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు. మీరు వెళ్ల‌వ‌ద్ద‌న్నారు క‌నుక మేం ప‌లాస‌కు వెళ్ల‌డం లేదు. మీరు నోటీసులు ఇచ్చారు క‌నుక మేం వాటిని ప‌రిగ‌ణిస్తున్నాం. ఇదే స‌మ‌యంలో మీరు క‌నీసం న‌న్ను మాట్లాడ‌నివ్వ‌డం లేదు. ప్రివెంటివ్ అరెస్టులు చెప్పి మ‌మ్మ‌ల్ని వేధిస్తున్నారు అంటూ విశాఖ కేంద్రంగా, అంత‌కుమునుపు శ్రీ‌కాకుళం కేంద్రంగా పోలీసు ఉన్న‌తాధికారుల‌తో లోకేశ్ మాట్లాడారు. ఎన్న‌డూ లేని విధంగా మిగ‌తా నాయ‌కులంతా ఏక‌తాటిపై నిలిచి తమ నాయకుడికి అండ‌గా ఉంటూ అడుగడుగునా ఐక్య‌త చాటారు.

శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ జిల్లాల‌కు చెందిన నేత‌లు త‌ర‌లి రావ‌డంతో లోకేశ్ ప‌ర్య‌ట‌న‌కు విప‌రీతం అయిన క్రేజ్ వ‌చ్చింది. మీడియాలో అటెన్ష‌న్ వ‌చ్చింది. పోలీసులు అత్యంత అమాన‌వీయ ధోర‌ణిలో త‌మ విష‌య‌మై ప్ర‌వ‌ర్తిస్తున్నారని పేర్కొంటూ ప‌దే ప‌దే లోకేశ్ ఈ విష‌యాల‌ను మీడియా దృష్టికి తీసుకువ‌చ్చారు. అదేవిధంగా విశాఖ ఏసీపీ తో కూడా ఇవే మాట‌లు చెప్పి, ఇది ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని అన్నారు. రెండు సార్లు మీడియా మీట్ ను ఆపే ప్ర‌య‌త్నం చేసిన విశాఖ ఏసీపీని తెలుగుదేశం నాయ‌కులు అడ్డుకున్నారు. ఆ త‌రువాత కూడా గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం న‌డుమే లోకేశ్ మాట్లాడారు. అటుపై విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాక అక్క‌డ కూడా ఎంట్ర‌న్స్ గేట్ దగ్గ‌ర బైఠాయించి త‌న నిర‌స‌న తెలిపారు. కేవ‌లం త‌మ‌ను అడ్డుకునేందుకే ఇంత‌గా పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారని, ఇదే చొర‌వ పేద‌ల విష‌య‌మై చూపితే వారికి న్యాయం ద‌క్కేది అని అన్నారు లోకేశ్. ఏ విధంగా చూసుకున్నా నిన్న‌టి వేళ పోలీసు చ‌ర్య‌ల‌న్నీ కూడా ఏక‌ప‌క్షంగానే ఉన్నాయ‌ని, ఇవ‌న్నీ నిరంకుశ‌త్వంలో భాగంగానే ఉన్నాయ‌ని టీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిన్న‌టి వేళ ఏపీ పోలీసులు చుక్కలు కనిపించాయి. ఉన్న‌తాధికారుల ఆదేశాలు అనుస‌రించి ఎక్క‌డిక‌క్క‌డ ఆంక్ష‌లు విధించారు. వీలున్నంత వ‌ర‌కూ టీడీపీ నాయ‌కుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో శ్రీ‌కాకుళం నుంచి విశాఖ వ‌ర‌కూ నాట‌కీయ ప‌రిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. వివాదాస్ప‌ద ప‌లాస ప్రాంతానికి వెళ్లేందుకు వీల్లేద‌ని నారా లోకేశ్ ను తొలుత కొత్త రోడ్డు ద‌గ్గర అడ్డుకుని జేఆర్ పురం స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఆ అరెస్టు సంద‌ర్భంగా కూడా చాలా గంద‌ర‌గోళం నెల‌కొంది. అంతేకాదు టీడీపీ నాయ‌కులు చాలా మంది క‌ళా వెంక‌ట్రావు మొద‌లుకుని చౌద‌రి బాబ్జీ వ‌ర‌కూ అరెస్టును ప్ర‌తిఘ‌టిస్తూ రోడ్డుపై బైఠాయించారు. లోకేశ్ కూడా చాలా సేపు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై త‌మ‌కు నోటీసులు ఇవ్వ‌డం ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్న. ఇదే ప్ర‌శ్న పోలీసుల ఎదుట ఉంచారు. కానీ వాళ్లేం స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు.

ఇవ‌న్నీ ఉన్న‌తాధికారుల ఆదేశాలేన‌ని, తామే చేయ‌లేమ‌ని క్షేత్ర స్థాయిలో ప‌నిచేసిన పోలీసులు నిన్న‌టి వేళ లోకేశ్ కు చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు. అయినా స‌రే లోకేశ్ మాత్రం వెనుకంజ వేయ‌కుండా తాను చ‌ట్టాల‌ను గౌర‌విస్తాన‌ని అంటూనే, ప్ర‌జా స్వామ్య దేశంలో అంద‌రికీ మాట్లాడే స్వేచ్ఛ, హక్కు అన్న‌వి ఉంటాయ‌ని వాటిని ప‌రిగ‌ణించాల‌ని, హక్కుల ఉల్లంఘ‌న అన్న‌ది స‌రికాద‌ని ప‌దే ప‌దే పోలీసుల‌కు హిత‌వు చెప్పారు. అదేవిధంగా పోలీసులు ఓ గౌరవ శాస‌న‌స‌భ్యుడి విష‌య‌మై న‌డుచుకునే ప‌ద్ధ‌తి ఇది కాద‌ని, తామేం లా అండ్ ఆర్డ‌ర్ ను డిస్ట్ర‌బ్ చేయ‌డం లేద‌ని కూడా చెప్పారు.

ఆ విధంగా విప‌క్ష నేత‌లు లోకేశ్ తో స‌హా ఇత‌ర నాయ‌కులు త‌మ దైన పోరాటం సాగించి, త‌మ నిర‌స‌న‌లు తెలిపి, తాము చెప్పాల‌నుకున్న‌దేదో చెప్పారు. వైసీపీ స‌ర్కారు హ‌యాంలో ఎప్ప‌టి నుంచో నెల‌కొన్న సంస్కృతి మాట్లాడేవారిని మాట్లాడ‌నివ్వ‌క‌పోవ‌డ‌మేన‌ని, ఇదే సంస్కృతిని ఆ రోజు తాము అమ‌లు చేసి ఉంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చేసేవారా అని లోకేశ్ ప్ర‌శ్నించారు. ప్ర‌శ్నిస్తే చాలు ఇంటికి జేసీబీని పంపిస్తున్నార‌ని, ఇంత క‌న్నా దారుణం ఇంకేమ‌యినా ఉంటుందా అని లోకేశ్ ఆవేద‌న చెందారు.

ఇదే వాద‌న పోలీసుల ఎదుట, మీడియా ఎదుట వినిపించి వెళ్లారు. శ్రీ‌కాకుళం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంలో లోకేశ్ తో స‌హా ప‌లువురు నాయ‌కులు నిన్న‌టి వేళ ప్రివెంటివ్ అరెస్టుల‌కు గుర‌య్యారు. ఎక్క‌డిక్క‌డ నోటీసులు, ఎక్క‌డిక‌క్క‌డ పోలీసుల నిర్బంధాలు ఉన్నా కూడా యువ నాయ‌కులు లోకేశ్ త‌న పోరాటం సాగించారు. వీలున్నంత వ‌ర‌కూ పోలీసు తీరును ప్ర‌తిఘ‌టించారు. త‌న కార్య‌క‌ర్త‌ల‌ను కూడా లా అండ్ ఆర్డ‌ర్ త‌ప్పి పోనివ్వ‌ద్ద‌ని, మ‌నం చ‌ట్టాల‌ను, న్యాయ‌స్థానా ల‌నూ గౌర‌విద్దాం అంటూ ప‌దే ప‌దే చెబుతూ, త‌న బాధ‌ను చెప్పుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు.