Begin typing your search above and press return to search.

అటు పవన్...ఇటు జూనియర్... మధ్యలో చంద్రబాబు

By:  Tupaki Desk   |   27 Aug 2022 2:30 AM GMT
అటు పవన్...ఇటు జూనియర్... మధ్యలో చంద్రబాబు
X
తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక సినీ నటుడి ద్వారా జరిగింది. ఆరు పదుల వయసులో సినీ జీవితానికి సెలవిచ్చి రాజకీయాల్లోకి సీనియర్ ఎన్టీయార్ వచ్చారు. వస్తూనే పార్టీ పెట్టి సీఎం అయిపోయారు. ఇక అది లగాయితూ టీడీపీకి సినీ గ్లామర్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. దానికి పొలిటికల్ గ్రామర్ అద్దిన వారు అయితే కచ్చితంగా చంద్రబాబే అని చెప్పాలి. బాబు వ్యూహాలు, ఆయన చతురత టీడీపీని ఈ రోజు వరకూ ఇలా జెండా ఎగరేసేలా చేశాయి.

అయితే సినీ గ్లామరే టీడీపీకి బలం, అదే కొన్ని సార్లు బలహీనత కూడా అవుతోంది. టీడీపీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. 2014 నాటి పొత్తులను కొనసాగించాలనుకుంటోంది. అయితే జనసేన మునుపటిది కాదు, దాంతో ఆ పార్టీ నుంచి గట్టిగానే డిమాండ్స్ వస్తున్నాయి. టీడీపీతో పొత్తు అంటే సీఎం సీటు షేరింగ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఆలోచనలో పడిన తెలుగుదేశం చాలా కాలంగా సైలెంట్ గా ఉంది

అందుకే ఈ మధ్యన మన చేనేత మన గర్వం అంటూ పవన్ నుంచి వచ్చిన చాలెంజికి కూడా చంద్రబాబు పెద్దగా రియాక్ట్ కాలేదని అంటారు. మరో సందర్భంలో జనసేనాని మాట్లాడుతూ తనకు వైసీపీ లాగానే టీడీపీ కూడా అన్నారు. రెండు పార్టీలతో సమాన దూరం పాటిస్తాను అని హాట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా కూడా టీడీపీ శిబిరంలో ఎలాంటి కలవరం లేదు. ఒక విధంగా టీడీపీ ఈ విషయాల మీద బాగానే కసరత్తు చేసింది అనుకోవాలి.

ఇక ఇపుడు జూనియర్ ఎన్టీయార్ విషయం తీసుకుంటే ఆయన టీడీపీకి దగ్గరా దూరామా అంటే ఎవరూ చెప్పలేరు. అలాంటి జూనియర్ ని బీజేపీ పెద్దాయన, కేంద్రంలో కీలకమైన హోం మంత్రిగా ఉన్న అమిత్ షా డిన్నర్ కి పిలిచి మరీ టీడీపీ శిబిరాన్ని కెలికారు అనే చెప్పాలి. అలాగే జూనియర్ లో ఎక్కడో దాగి ఉన్న రాజకీయ ఆకాంక్షలను కూడా తట్టిలేపాల‌ని బీజేపీ గట్టిగానే ప్రయత్నం చేసింది.

నిజంగా ఇది టీడీపీకి కంగారు పుట్టించాల్సిన సందర్భమే. జూనియర్ కనుక చురుకు పుట్టి రాజకీయంగా సందడి చేస్తే టీడీపీకి అది ఎంతో కొంత ఇబ్బందే. అయితే ఈ విషయంలో కూడా టీడీపీ చాలా సైలెంట్ గానే ఉంది. ఆ పార్టీ నుంచి ఒకరిద్దరు నేతలు అయితే మామూలుగా స్పందించి ఊరుకున్నారు. దాంతో ఈ ఇష్యూకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ పార్టీ భావించినట్లుగా ఉంది అంటున్నారు.

చూస్తే ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్. ఇద్దరూ అశేష తెలుగు జనాలను విశేషంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు మరో వైపు తెలుగుదేశానికి ఇద్దరి అవసరం ఉంది. అలాగే ఇద్దరూ గతంలో ఆ పార్టీకి తమ వంతుగా సాయం చేసినవారే. అయితే మారిన రాజకీయ నేపధ్యంలో తెలుగుదేశం సినీ గ్లామర్ కంటే కూడా పొలిటికల్ గ్రామర్ ని నమ్ముకుంది అనడానికి ఉదాహరణే ఆ పార్టీ సైలెంట్ గా రియాక్ట్ కావడం

రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఏ సాయాన్ని కోరి కాదనుకోరు. కానీ అలవి కానివి, పార్టీకి ఇబ్బంది కలిగిస్తాయనుకున్న వాటి విషయంలో మౌనంగా రాజకీయం చేస్తారు. ఒక విధంగా చేసిన టీడీపీ మెచ్యూర్ట్డ్ పాలిటిక్స్ కి ఇదొక ఉదాహరణగా చూడాలి.