Begin typing your search above and press return to search.

జగన్... పవన్.. మధ్యలో బాబు...?

By:  Tupaki Desk   |   25 April 2022 9:31 AM GMT
జగన్... పవన్.. మధ్యలో బాబు...?
X
ఏపీలో రాజకీయాలు ముగ్గురు మధ్యన మూడు పార్టీల మధ్యనే రంజుగా సాగుతున్నాయి. ఏపీలో రెండు పార్టీలు బలమైనవి. అధికారం కూడా రుచి చూసినవి. అవే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ. ఇక కొత్తగా వచ్చిన పార్టీ జనసేన. ఆ పార్టీ అధినేత పవన్ వైసీపీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ మీద ఆయన ఎపుడూ బాణాలు వేస్తూంటారు. మరి వైసీపీ మంత్రులు నాయకులు తక్కువ తింటారా. వారు కూడా గట్టిగానే రిటార్ట్ ఇచ్చేస్తారు.

దీంతో వైసీపీ వర్సెస్ జనసేనల మధ్య సాగుతున్న‌ మాటల దాడులను, రాజకీయ రచ్చను టీడీపీ చాలా సైలెంట్ గా చూస్తోంది. నిజానికి జనసేన టీడీపీకి మద్దతుగా ఉందన్నదే వైసీపీ బాధ, ఆగ్రహం. దాంతో పవన్ని గట్టిగా టార్గెట్ చేస్తోంది. దానికి పవన్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైసీపీకి తాజాగా అస్త్రాలుగా మారుతున్నాయి.

నిజానికి రాజకీయాల్లో అయితే చివరి వరకూ ఎవరూ ఎన్నికల వ్యూహాలను బయటపెట్టుకోరు. కానీ పవన్ అవగాహన మితోనో. లేక అతి ఉత్సాహంతోనే జనసేన ఆవిర్భావ సభలో సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా చూస్తామని ఆయన చేసిన ప్రకటనతో వైసీపీ ఇపుడు ఆడుకుంటోంది అనే చెప్పాలి.

పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. మరి ఒక్క ఓటు కూడా వైసీపీ వ్యతిరేకమైనది చీలకుండా చేయాలీ అంటే ఏపీలో అతి పెద్ద పార్టీ నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీని కలుపుకుని పోతామని చెప్పడమే కదా. దాంతోనే పవన్ వ్యూహం చెప్పకనే చెప్పేశారు అన్న మాట. దాన్ని అందిపుచ్చుకుని వైసీపీ ఒక్క లెక్కన పవన్ని టార్గెట్ చేస్తోంది.

దత్తపుత్రుడు అంటూ గట్టిగానే సౌండ్ చేస్తోంది. తనను అలా అనవద్దు అని పవన్ చెబుతున్నా వినకుండా ఒక విధంగా పొలిటికల్ ర్యాగింగ్ చేస్తోంది. ఇక వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడం అంటే దానికి తన అర్ధమేంటో పవన్ ఈ రోజుకీ చెప్పలేకపోతున్నారు. ఆయన మంగళగిరిలో జరిగిన పార్టీ నేత సభలో కూడా మా వ్యూహాలు మాకు ఉంటాయని చెప్పారు తప్ప అంతకు మించి ఏమీ చెప్పలేదు.

దాంతో దీని మీద జనసేనలోనూ అనుమానాలు పెరుగుతున్నాయి. వైసీపీకి కూడా అదే కావాల్సింది. టీడీపీ పల్లకీ పవన్ మోస్తున్నాడు అని అంటున్నారు. దత్తపుత్రుడు అని ముద్ర వేస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ లో వైసీపీ కోరుకునేది ఏంటి అంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా అనుకున్న లక్ష్యం అయితే నెరవేరకూడదు. ఇపుడు అదే జరిగేలా ఉంది.

రెండేళ్లకు ముందే పొత్తుల కధను విప్పితే జనసేనలో చేరాలనుకున్న వారి మోజు పోతోంది. అలాగే టీడీపీలో ఉన్న వారు కూడా తమ సీట్లకు గల్లంతని భావించే సీన్ ఉంది. ఇంకో వైపు టీడీపీతో జనసేన పొత్తును రెండు పార్టీలలో అంగీకరిచని వారూ ఉన్నారు. అలా ఒక రకమైన గందరగోళంలో ఈ పొత్తులను నెట్టి గరిష్ట లాభం పొందాలన్నదే వైసీపీ ఎత్తుగడ.

ఇక అనాల్సింది అనేసి, గుట్టు విప్పేసిన తరువాత పవన్ తనను దత్తపుత్రుడు అనవద్దు అని అంటే వైసీపీ ఊరుకుంటుందా. అందుకె మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే ఎన్నో ఉదాహరణలు చూపెడుతూ చంద్రబాబు మేలు కోసం పుట్టిన పార్టీ జనసేన అనేశారు. దాంతో ఇపుడు జనసేన టార్గెట్ అవుతోంది. ఇదంతా టీడీపీ కోసమని తెలిసినా ఆ పార్టీ మాత్రం సైలెంట్ గానే దీన్ని చూస్తోంది.

మొత్తానికి ఈ పరిణామాలతో ఎన్నికల వేళకు పవన్ టీడీపీకి మిత్రుడు అవుతారా లేక ఒంటరి బాట పడతారా అన్నది కూడా చూడాలి. ఏది జరిగినా వైసీపీ తనకు లాభమే అనుకుంటోంది. ఇక చంద్రబాబు ఈ టైమ్ లో ఏమీ అనలేని పరిస్థితి. ఎక్కడ వైసీపీ పొలిటికల్ ర్యాగింగ్ తో పవన్ ఆగ్రహించి పొత్తులు లేవు అంటారేమో అని కూడా టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. కనీసం జనసేనకు మాట సాయం చేయాలనుకున్నా అది బాహాటమైపోతే మరిన్ని చిక్కులు వస్తాయని టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయినా రెండేళ్ళకు ముందు ఎన్నికల పొత్తుల గురించి పవన్ మాట్లాడి తొందరపడ్డారు అనే అంటున్నారు.