Begin typing your search above and press return to search.

రాజీనామాలు చేయించి జగన్ పై ఒత్తిడి పెంచచ్చుకదా ?

By:  Tupaki Desk   |   29 July 2022 9:30 AM GMT
రాజీనామాలు చేయించి జగన్ పై ఒత్తిడి పెంచచ్చుకదా ?
X
'పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తెప్పించేందుకు వైసీపీ ఎంపీలందరు దమ్ముంటే రాజీనామా చేయాలి' ఇది చంద్రబాబునాయుడు చేసిన డిమాండ్. తెలంగాణా నుంచి ఏపీలో విలీనమైన మండలాల్లో చంద్రబాబు పర్యటించినపుడు పై డిమాండ్ చేశారు.

ఎంపీలందరు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్యాకేజీ నుండి నిధులు విడుదలై ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాదో చూద్దామన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పదే పదే వైసీపీ ప్రజా ప్రతినిధుల రాజీనామాల గురించి చంద్రబాబు డిమాండ్ చేస్తునే ఉన్నారు.

అమరావతి విషయంలో వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలని కొంతకాలం డిమాండ్లు చేశారు. తర్వాత వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలన్నారు. మళ్ళీ ప్రజా మద్దతు ఉందని అనుకుంటే నిరూపించుకునేందుకు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాలని కొంతకాలం నానా గోలచేశారు. ఇపుడేమో పోలవరం ప్రాజెక్టు నిధులకోసం వైసీపీ ఎంపీలందరు రాజీనామాలు చేయాలని డిమాండ్ అందుకున్నారు.

ఏదోరూపంలో వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలన్న ఆలోచన తప్ప సమస్య పరిష్కారానికి మార్గం చూద్దామని మాత్రం అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రత్యేకహోదాపై ఎంపీలందరితో రాజీనామాలు చేయిద్దామని ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి సూచించారు.

ముందు సరే అని తర్వాత వెనక్కు తగ్గారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయరన్న విషయం తేలిపోగానే జగన్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకహోదాపై చిత్తశుద్దో లేకపోతే రాజకీయ అడ్వాంటేజ్ కోసమో జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయించింది వాస్తవం.

మరదే పద్దతిలో చంద్రబాబు ఎందుకు తన ఎంపీలతో రాజీనామాలు చేయించకూడదు ? చంద్రబాబు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసినా, సవాలు చేసినా వైసీపీ స్పందించదన్నది వాస్తవం. ఎదుటివాళ్ళని రాజీనామాలు డిమాండ్ చేసే ముందు తన చేతిలో ఉన్న పనినే చంద్రబాబు ఎందుకు చేయించకూడదు. టీడీపీ ఎంపీలు, ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తే ఆటోమేటిగ్గా జగన్ పైన ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు ఆలోచించటంలేదు ?