Begin typing your search above and press return to search.

ఏపీ స్థానిక‌త ఎందుకు వ‌ద్ద‌నుకుంటున్నారు?

By:  Tupaki Desk   |   15 May 2017 10:25 AM GMT
ఏపీ స్థానిక‌త ఎందుకు వ‌ద్ద‌నుకుంటున్నారు?
X
రాష్ర్ట విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఉండి, ఆపై ఏపీకి వెళ్లి అక్కడి స్థానికతను కోరుకుంటున్న‌వారు చాలా త‌క్కువ సంఖ్య‌లో ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. కేవలం 850 మంది మాత్రమే ఇలా ఏపీ స్థానిక‌త కోరుకోవ‌డంతో దీని వెనుక కార‌ణ‌మేంటా అన్న అయోమ‌యం నెల‌కొంది. ఏపీ స్థానికత కోరేందుకు గడువు మరో 15 రోజులు మాత్రమే మిగిలివుండటంతో, చాలా తక్కువ మంది మాత్రమే దరఖాస్తులు చేసుకోవడం అధికార వర్గాలు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. దీంతో స్థానిక‌త కోరుకునేందుకు గ‌డువు పెంచే దిశ‌గా ఆలోచిస్తున్నారు.

వాస్తవానికి విభజన తరువాత మూడేళ్లలోపు ఏపీకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ స్థానికత కల్పించేలా ప్రభుత్వం అంగీకరించింది. ఆపై జూన్ 2, 2017లోపు ఏపీలోని 13 జిల్లాల్లో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకుని, మీ సేవలో దరఖాస్తు చేస్తే స్థానికత లభిస్తుంది. ఈ అధికారం ఆ ప్రాంత ఎమ్మార్వోలకే ఇచ్చారు. అయితే అత్యధిక మండలాల్లో కనీసం ఒక్కరు కూడా స్థానికతను కోరలేదు.

పలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఇప్పుడిప్పుడే నవ్యాంధ్రకు వస్తుండటం, 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ ను వీడకపోవడం, కొత్త పరిశ్రమలు వస్తే, మరింత మందికి ఉపాధి లభించి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్న అంచనాలతో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగించాలని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మ‌రోవైపు సామాన్యులకు స్థానికత మార్పుపై అవగాహనా లేక‌పోవ‌డం.. అవ‌గాహ‌న క‌ల్పించే దిశ‌గా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం కూడా దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.