Begin typing your search above and press return to search.

రోజా కోసం... లోడెడ్ గ‌న్ సిద్ధ‌మైందా?

By:  Tupaki Desk   |   16 March 2017 6:45 AM GMT
రోజా కోసం... లోడెడ్ గ‌న్ సిద్ధ‌మైందా?
X
కాల్ మనీ రాక్ష‌సత్వాన్ని ప్ర‌శ్నించి ఏడాది పాటు శాస‌నస‌భ నుంచి స‌స్పెండ్ అయ్యి... మొన్న‌నే అసెంబ్లీలో తిరిగి అడుగుపెట్టిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌ - చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి. రోజాపై విధించిన ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ కాలం ముగిసిన నేప‌థ్యంలో ఆ వ్య‌వ‌హారానికి సంబంధించి ప్రివిలేజెస్ క‌మిటీ మ‌రో నివేదిక‌ను సిద్ధం చేసింద‌ని, స‌ద‌రు నివేదిక ఇప్పుడు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కార్యాల‌యంలో ఉంద‌ని, ఏ క్ష‌ణాన్నైనా రోజాపై మ‌రో ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న కూడా వినిపించింది. ఈ క్ర‌మంలో స‌భ జ‌రిగే ప్ర‌తి రోజు కూడా ఈ విష‌యంపై ఏవైనా అడుగులు ప‌డ‌తాయా? అన్న కోణంలో ఆస‌క్తిక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే ఇప్ప‌టికే అన‌వ‌స‌రంగా ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ విధించి... జ‌నం దృష్టిలో రోజాను హీరోను చేసేసి, తాము విల‌న్లుగా మారిపోయామ‌న్న భ‌యంతో టీడీపీ స‌ర్కారు కాస్తంత సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న భావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

అయితే రోజాను స‌భ నుంచి శాశ్వ‌తంగా పంపించివేసేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకునేందుకు సిద్ధంగా లేద‌న్న క‌థ‌నాలు కూడా ఆస‌క్తి రేపుతున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న అధికార ప‌క్షం నుంచే కాకుండా... స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి కూడా ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం... రోజా స‌స్పెన్ష‌న్‌ కు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు నేతృత్వంలోని ప్రివిలేజెస్ క‌మిటీ రూపొందించిన నివేదిక‌ను స్పీక‌ర్ నేడు స‌భ ముందు పెడ‌తార‌ట‌. నేటి స‌మావేశాల్లో ఈ నివేదిక స‌భ ముందుకు వ‌చ్చినా... దానిపై ఇప్ప‌టికిప్పుడు చ‌ర్చ ఉండ‌ద‌ని కూడా ఆ ప్ర‌క‌ట‌న ప‌రోక్షంగా చెప్పేసింది. ఈ ద‌ఫా బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసేలోగా ఏదో ఒక రోజు చ‌ర్చ దీనిపై చ‌ర్చ త‌ప్ప‌క ఉండాల్సి ఉంది. అయితే ఈ స‌మావేశాల్లో అస‌లు దీనిపై చ‌ర్చ ఉంటుందా? అన్న అనుమానం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో నిన్న ఓ ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది.

టీడీపీకి చెందిన కీల‌క నేత‌లను ఉటంకిస్తూ వెలుగుచూసిన ఈ క‌థ‌నం, తాజాగా నేటి స‌భ‌లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌ వివ‌రాల్లోకెళితే... రోజాను మ‌రో ఏడాది పాటు సస్పెన్ష‌న్ చేయాల్సిందేన‌ని కూడా గొల్ల‌ప‌ల్లి క‌మిటీ స‌భ‌కు సిఫార‌సు చేసింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత‌ను దూషించినందుకు గానూ రోజాపై ఈ మేర చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని కూడా ఆ క‌మిటీ త‌న వాద‌న‌ను స్పీక‌ర్ ముందు ఉంచింది. అయితే రోజాపై స‌స్పెన్ష‌న్ విధించాలా? వ‌ద్దా? అన్న విష‌యాన్ని మాత్రం క‌మిటీ స‌భ‌కే వ‌దిలేసింది. ఈ లెక్క‌న టీడీపీ స‌ర్కారు చేతిలో ప్రివిలేజెస్ క‌మిటీలో ఫుల్లీ లోడెడ్ గ‌న్‌ను పెట్టేసింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అంటే... ఇప్ప‌టికిప్పుడు కాకున్నా... ఎప్పుడు అవ‌స‌ర‌మ‌నుకుంటే... అప్పుడు రోజాపై స‌స్పెన్ష‌న్ వేటు వేసే వెసులుబాటును ఆ క‌మిటీ చంద్ర‌బాబు స‌ర్కారు చేతిలో పెట్టేసింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అంటే... ప్ర‌భుత్వంపై త‌న‌దైన మార్కు ప‌దునైన మాట‌ల‌తో రోజా విరుచుకుప‌డ‌నంత కాలం రోజాపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌ద‌ట‌. అదే గ‌తంలో మాదిరి ప్ర‌భుత్వంపై రోజా దాడి మొద‌లుపెడితే... వెనువెంట‌నే ఈ నివేదిక‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని,. ఆ వెంట‌నే ఆమెపై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంద‌న్న‌ది ఆ క‌థ‌నం సారాంశం. చూద్దాం ఏం జ‌రుగుతుందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/