Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదాల్లో ఏపీ రికార్డు!

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:30 AM GMT
రోడ్డు ప్రమాదాల్లో ఏపీ రికార్డు!
X
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాల తీవ్ర విమర్శలకు కారణమవుతున్న అంశాల్లో ఒకటి.. రోడ్లు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా రోడ్లను పట్టించుకోకపోవడంతో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు పరిస్థితి ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ ఓడిపోతే అందుకు గల కారణాల్లో రోడ్లు కూడా కారణమైతే ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఆ స్థాయి అధ్వాన స్థితిలో ఏపీ రోడ్లు ఉన్నాయని చెబుతున్నారు.

కాగా వర్షాకాలంలో తీవ్ర వర్షాల ధాటికి, వరదల ధాటికి చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణిస్తూ ఇప్పటివరకు వందల్లో కాదు.. వేలల్లో మరణించినా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉండటం లేదని ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఒక్క 2022లోనే జనవరి నుంచి అక్టోబరు వరకు పది నెలల్లో రాష్ట్రంలో 14,314 ప్రమాదాలు జరగ్గా... ఏకంగా 5,831 మంది ప్రాణాలు కోల్పోవడం ఏపీలో రోడ్ల దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఏడాది పది నెలల కాలంలోనే మరో 15,585 మంది క్షతగాత్రులయ్యారు.

కాగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పది నెలల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 370 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత వైయస్‌ఆర్‌ కడపలో 346 మంది, విశాఖపట్నంలో 341 మంది, కర్నూలులో 338, అనంతపురంలో 328 మంది మరణించారు.

అదే గతేడాది 2021లో జనవరి నుంచి అక్టోబరు వరకు 13,019 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 5,472 మంది మరణించగా... 14,027 మంది గాయపడ్డారు.

విశాఖపట్నంలో జిల్లాలో అత్యధికంగా 1,110 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తర్వాత గుంటూరులో 940, తూర్పుగోదావరిలో 861, కృష్ణాలో 860, వైయస్‌ఆర్‌ కడపలో 806 ప్రమాదాలు సంభవించాయి.

ప్రమాదాల్లో గాయపడ్డవారు ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో 1,075 మంది ఉన్నారు. తర్వాత తూర్పుగోదావరిలో 979, ప్రకాశంలో 912, వైయస్‌ఆర్‌ కడపలో 903, కృష్ణాలో 891 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు వివరిస్తున్నాయి.

2021తో పోలిస్తే 2022లో ప్రమాదాలు 9.95%, మరణాలు 6.56%, క్షతగాత్రుల సంఖ్య 11.11% పెరగడం గమనార్హం.

రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారులే ప్రమాదాలకు కారణమవుతున్నాయని అంటున్నారు. అడుగుకో గుంత ఉంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా మార్గాల్లో కొత్తగా ప్రయాణించే వారికి ఎక్కడ గుంత ఉందో తెలియకపోవడంతో.. వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. లేదంటే తీవ్రంగా గాయపడుతున్నారు.

మరోవైపు ప్రమాదాలకు గురవుతున్న వాటిలో ద్విచక్ర వాహనాలు, కార్లు అత్యధికంగా ఉంటున్నాయి. స్వయంగా పోలీసు శాఖ వర్గాలే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో రహదారి భద్రత మండలి ఏర్పాటైనప్పటికీ ఫలితం శూన్యమని చెబుతున్నారు. ప్రమాదాలు ఏమీ తగ్గకపోవడం ఈ మండలి వైఫల్యమే అని చెప్పకతప్పదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత నిధి కింద రూ.125 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులనూ ఖర్చు చేయలేదని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.