Begin typing your search above and press return to search.

కోడెలకు గట్టి షాక్..కొడుకు షోరూం లైసెన్స్ రద్దు!

By:  Tupaki Desk   |   29 Aug 2019 4:08 PM GMT
కోడెలకు గట్టి షాక్..కొడుకు షోరూం లైసెన్స్ రద్దు!
X
టీడీపీ సీనియర్ నేత - ఏపీ అసెంబ్లీ తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కోడెలతో పాటు ఆయన కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలపై పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కాగా... తాజాగా గుంటూరు కేంద్రంగా కుమారుడు నడుపుతున్న బైక్ ల షోరూం లైసెన్స్ ను రద్దు చేస్తూ ఏపీ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గౌతం ఆటోమోటివ్స్ పేరిట కోడెల శివరాం గుంటూరు కేంద్రంగా నడుపుతున్న హీరో షోరూం లైసెన్స్ ను రద్దు చేయడంతో పాటుగా సదరు షోరూంకు కొత్తగా బైకులను సరఫరా చేయకుండా కూడా అధికారులు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో కోడెలకే కాకుండా మొత్తంగా ఆయన ఫ్యామిలీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పక తప్పదు.

తాజా ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ అదికారంలోకి రావడంతో కోడెలకు కష్టాు మొదలయ్యాయి. కోడెల స్పీకర్ పదవిని అడ్డుపెట్టుకుని ఆయన కుమారుడు - కుమార్తె... కేట్యాక్స్ పేరిట భారీ దందా నడిపారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు చాలా మంది బాధితులు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయం పై - కోడెల ఫ్యామిలీ దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేశారు. దీంతో ఎక్కడికక్కడ కోడెల కుమారుడు - కుమార్తె లపై కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో శివరాం షోరూంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం జరుగుతోందని - పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ను శివరాం ఎగ్గొట్టాడని ఆరోపణలతో అధికారులు గౌతం షోరూంపై దాడులు చేశారు. ఈ దాడుల్లో శివరాం అక్రమాలు బయటపడ్డాయి. ఆర్టీఏ చట్టాలను ఉల్లంఘించి శివరాం ఏకంగా 576 వాహనాలను విక్రయించారని అధికారులు నిగ్గు తేల్చారు.

గౌతం షోరూంలో అక్రమాలు నిగ్గు తేలిన నేపథ్యంలో గురువారం రవాణా శాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. గౌతం ఆటోమోటివ్స్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు... డీలర్ షిప్ ను రద్దు చేశారు. అంతేకాకుడా ఇకపై కోడెల కుమారుడి షోరూంతో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదంటూ హోరో మోటో కార్ప్ కు సూచించారు. హోరో మోటార్స్ కు చెందిన బైకులను కోడెల శివరాం ఎలా నిబంధనలు ఉల్లంఘించి విక్రయించారన్న వివరాలను సమగ్రంగా ఆ సంస్థకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా అధికారులు హీరో మోటార్స్ కు అందజేశారట. మొత్తంగా శివరాం బైకుల వ్యాపారానికి దాదాపుగా ముగింపు పడిపోయిందన్న మాట.