Begin typing your search above and press return to search.

క‌త్తులు దూసిన‌ కోళ్లు.. క‌ట్టలు తెగిన కోట్లు.. నేత‌లే సొమ్ము చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   17 Jan 2023 6:30 AM GMT
క‌త్తులు దూసిన‌ కోళ్లు.. క‌ట్టలు తెగిన కోట్లు.. నేత‌లే సొమ్ము చేసుకున్నారా?
X
ఏపీలో పందెం కోళ్లు క‌త్తులు దూశాయి. సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన పందేల్లో.. కోట్ల రూపాయ‌ల క‌ట్ట‌లు.. వ‌ర‌ద‌లై పారాయి. అధికారిక అంచనా ప్ర‌కారం 500 కోట్ల రూపాయ‌లు ఈ పందేల్లో చేతులు మారాయ‌ని చెబుతున్నారు. అన‌ధికారికంగా.. దాదాపు 2 వేల‌ కోట్ల వ‌ర‌కు ఈ లెక్క ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక‌, ఈ పందేల్లో చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేత‌లే చెల‌రేగిపోతారు. కాసుల పంట పండించుకుంటారు.

ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉండ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు చెలరేగిపోయారు. ఫ‌లితంగా పందేలు.. ఇతర గుండాట‌, పేకాట‌, రికార్డింగ్ డ్యాన్స్ వంటి కార్యక్ర‌మాల‌కు అనుమ‌తుల పేరిట మ‌రిన్ని కోట్లు జేబుల్లో వేసుకున్నార‌ని అంటున్నారు.

అయితే.. వాస్తవానికి ఎక్క‌డిక‌క్క‌డ ఈ పందేల‌ను నిర్వ‌హించ‌రాద‌ని ప్ర‌భుత్వం మౌఖిక ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. వైసీపీ నాయ‌కులు మీరు ఎలానూ ఇవ్వ‌రు ఇలా అయినా.. ప‌ది రూపాయ‌లు సంపాయించుకుంటాం.. అని వాద‌న‌కు దిగి మ‌రీ పందేలు క‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కోడిపందేలు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి.. మూడు రోజుల్లో కోళ్ల మీదే రూ.150 కోట్లకు పైగా పందేలు సాగాయని అంచనా. జూదంపై ఇంతకు రెట్టింపు పందేలు కాసినట్లు సమాచారం. కోడి పందేల బరుల పక్కనే కోతముక్క, కోసు, మూడు ముక్కలాట, చిన్నబజారు, పెద్దబజారు, గుండాట, చిత్తాట, నెంబర్లాటతో పాటు... ఎక్కడికక్కడ గుడారాల్లో కాసినోలు కూడా ఏర్పాటుచేశారు.

ఈ ఏడాది కోడి పందేలను మించిన జూదం జరిగింది. ఈడుపుగల్లు వద్ద ఇలాంటి ఆటలకు సంబంధించి న 50కి పైగా టేబుళ్లు దర్శనమిచ్చాయి. తిరువూరులో ఒక్కో టేబుల్‌ మీద 5 నుంచి 10లక్షల ఆట సాగిం ది. ఈడుపుగల్లు, అంపాపురంలోనే 10 కోట్ల జూదం జరిగిందని అంచనా. ఒకవైపు ఆడుతూ, మరోవైపు తాగుతూ... మందుబాబులు, పేకాట రాయుళ్లు హల్‌చల్‌ చేశారు.

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి వద్ద కోడిపందాల బరులు తిరుణాళ్లను తలపించాయి. బరుల వద్ద ప్రవేశానికి ప్రత్యేక రుసుము పెట్టారు. శిబిరాల వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. లక్షల రూపాయల నగదు చేతులు మారింది. మొత్తంగా వైసీపీ నాయ‌కుల‌కు పందేలు పండ‌గ చేశాయ‌నే టాక్ వినిపించ‌డం గ‌మార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.