Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల ఎపిసోడ్ లో. హైకోర్టు తాజా ఆదేశాల పై ఏపీ సర్కార్ సవాల్?

By:  Tupaki Desk   |   15 Dec 2021 3:35 AM GMT
సినిమా టికెట్ల ఎపిసోడ్ లో. హైకోర్టు తాజా ఆదేశాల పై ఏపీ సర్కార్ సవాల్?
X
ఎవరెన్ని అనుకున్నా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నదే చేస్తున్నారు. ఆయన ఆలోచనలకు భిన్నంగా ఎవరెన్ని వినతులు చేసినా.. వ్యక్తిగతంగా వచ్చి కలిసినా.. ఆయన తీరు మాత్రం మారని పరిస్థితి. సినిమా థియేటర్ల టికెట్ల ధరల ఎపిసోడ్ దీనికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. కరోనా అనంతర పరిస్థితుల్లో కొత్త సినిమాలు.. అందునా పెద్ద సినిమాల ప్రదర్శన వేళలో.. ధరల్ని పెంచి టికెట్లు అమ్మటం.. అదనపు షోలు వేసుకోవటం లాంటివి చేయటం ద్వారా.. తక్కువ వ్యవధిలో ఎక్కువ కలెక్షన్ వచ్చేలా చేయటం తెలిసిందే.

అయితే.. ఇందుకు ససేమిరా అంటున్న జగన్ సర్కారు.. ఈ మధ్యనే రేట్ల ధరల్ని భారీగా తగ్గించేస్తూ తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిపై చిత్ర పరిశ్రమ వర్గాలు వేదన చెందుతున్నాయి. తమ నడ్డి విరిచేలా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందన్న ఆవేదన వ్యక్తం కావటం.. ప్రభుత్వ ఆదేశాల్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో స్పందించిన న్యాయస్థానం.. మంగళవారం ఏపీ సర్కారు ఆదేశాల్ని రద్దు చేస్తూ.. తాజాగా కొత్త ఆదేశాల్ని జారీ చేశారు. టికెట్ల ధరల్ని ఒక స్థాయి వరకు పెంచుకునే అవకాశం.. ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిని ఇచ్చారు. హైకోర్టు తాజా ఆదేశాలు చిత్ర పరిశ్రమకు ఊరటను ఇచ్చాయి. ఈ వారం విడుదలయ్యే పుష్ప మొదలు.. ఫిబ్రవరి వరకు బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు వరుస పెట్టి థియేటర్లలో సందడి చేయనున్న వేళ.. హైకోర్టు తాజా ఆదేశం ఊరటను ఇచ్చేలా ఉందని చెప్పాలి.

అయితే.. హైకోర్టు ఆదేశాల విషయంలో ఏపీ ప్రభుత్వం విబేదించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. టికెట్ల ధరల పెంపునకు వ్యతిరేకంగా ఉన్న ఏపీ ప్రభుత్వం.. సామాన్యులకు భారంగా మారే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తమ ఆదేశాల్ని చిత్ర పరిశ్రమకు చెందిన వారు సవాలు చేసి.. వారి వాదనకు తగ్గట్లుగా తీర్పు వచ్చిన నేపథ్యంలో.. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.