Begin typing your search above and press return to search.

ఏపీ సచివాలయ ఉద్యోగుల నోట వసతుల రాగం

By:  Tupaki Desk   |   3 Dec 2015 4:53 AM GMT
ఏపీ సచివాలయ ఉద్యోగుల నోట వసతుల రాగం
X
రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందుల్లో రాష్ట్ర సర్కారు.. ఏపీ ప్రజలు కిందామీదా పడుతుంటే.. ఏపీ సచివాలయ ఉద్యోగులు మాత్రం ప్రజల కోసం.. ప్రభుత్వం కోసం త్యాగాలు చేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. ఏపీ ప్రజలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక చోట ఉంటే.. అందుకు దూరంగా హైదరాబాద్ లో ఉన్న వేలాది మంది ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని జూన్ 1, 2016 నాటికి బెజవాడకు వచ్చేయాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిపై ఏపీ సచివాలయ ఉద్యోగులు పలు డిమాండ్లను తెరపైకి తేవటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురుకావటం తెలిసిందే.

దీంతో.. తాము గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని.. ఏపీరాజధానికి వచ్చేసేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఏపీ సచివాలయ ఉద్యోగులు ప్రకటించారు. ఉద్యోగులతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ సర్కారు చెప్పినప్పటికీ.. తాజాగా తమను సంప్రదించకుండానే జీవో జారీ చేయటం పల్ల ఏపీ సచివాలయ ఉద్యోగులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరు ఏమన్నా.. జూన్ 1 నాటికి హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో బెజవాడకు వచ్చేయాలని స్పష్టం చేస్తూ అధికారికంగా జీవో జారీ చేయటం ఏపీ ఉద్యోగుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. ప్రభుత్వం తనతో సంప్రదింపులు జరిపి.. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన తర్వాతేనిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో ఉన్న ఉద్యోగులకు షాకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం వారికి మింగుడు పడటం లేదు. దీంతో.. వారు తమ డిమాండ్లు అంటూ కొన్నింటిని తెరపైకి తీసుకొచ్చారు.

జూన్ 1లోపు బెజవాడకు వచ్చేయాలంటూ ఏపీ సర్కారు జారీ చేసిన జీవో మీద ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్పుటూరి మురళీకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు.. కొన్ని డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. ఏపీకి తరలించే ముందే కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలంటూ వారు కోరుతున్నారు.

ఎప్పటి మాదిరే బెజవాడకు వచ్చేస్తే తమ స్థానికత ఏమిటని? హెచ్ ఆర్ ఏ మీద స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులంతా ఒకేచోట ఉండేలా చేస్తే బాగుంటుందని.. అలాంటి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మరి హైదరాబాద్ లో వేర్వేరుగా కార్యాలయాలు ఉంటే పని చేసిన వారికి బెజవాడలో మాత్రం ఒకేచోట ఉండాలని కోరటం ఏమిటో?

ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. తెలంగాణ ప్రభుత్వంతో పోటీగా జీతాల్ని పెంచిన విషయాన్ని మరిచిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు తమకు బెజవాడకు వస్తే.. ఇవ్వాల్సిన అద్దె భత్యం మీద తేల్చాలని కూర్చున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేని రాష్ట్రంలో ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకోవాల్సిన ఉద్యోగులకు.. అసలు జీతం ఎందుకు పెంచాలన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రజలు ఏదో ఒక త్యాగం చేయాలి కానీ.. తాము మాత్రం ఎలాంటి త్యాగానికి సిద్ధం కావన్నట్లుగా డిమాండ్లు తెర మీదకు తెస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విబజన వ్యవహారంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల కారణం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. తాజాగా తెరపైకి తీసుకొచ్చిన డిమాండ్ల విషయంలో ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.