Begin typing your search above and press return to search.

స‌చివాల‌యం సాక్షిగా బాబుకు అవ‌మానం!

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:10 PM GMT
స‌చివాల‌యం సాక్షిగా బాబుకు అవ‌మానం!
X
ఏ రాష్ట్రంలో అయినా ముఖ్య‌మంత్రి ఫొటోల‌కు ప్ర‌భుత్వోద్యోగులు - అధికారులు అమిత గౌర‌వం ఇస్తుంటారు. అందులోనూ - మంత్రులు కొలువుదీరే స‌చివాల‌యంలో ప‌ని చేసే అధికారులు సీఎం ఫొటోకు స్పెష‌ల్ రెస్పెక్ట్ ఇస్తారు. అయితే, ఏపీ స‌చివాల‌యంలో అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. స‌చివాల‌యం సాక్షిగా వారు సీఎం చంద్ర‌బాబును ఘోరంగా అవమానించారు. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫొటోపై వారు వ్య‌వ‌హ‌రించిన‌ తీరు క‌ల‌క‌లం రేపింది. ఫ్రేమ్ క‌ట్టి ఉన్న చంద్ర‌బాబు ఫొటోను విద్యాశాఖ అధికారులు ట్రేలాగా - డ‌స్ట్ బిన్ లాగా వాడుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాము తిన్న ఎంగిలి ప్లేట్ల‌ను సీఎం ఫొటోపై ఉంచిన అధికారుల తీరును ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు. ఏపీ స‌చివాల‌యంలోని నాలుగో బ్లాక్ లో సోమ‌వారం జ‌రిగిన ఉన్న‌త విద్యాశాఖ అధికారుల స‌మావేశం సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

వాస్త‌వంగా సచివాలయంలో ఉన్న‌ ప్రతీ విభాగంలో - స‌మావేశ మందిరాల్లో సీఎం ఫోటో ఉంచ‌డం ఆన‌వాయితీ. మిగిలిన బ్లాకుల మాదిరిగానే నాలుగో బ్లాక్‌లో ఉన్న సమావేశ మందిరంలో కూడా చంద్రబాబు ఫోటో ఉంది. అయితే, అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఆ ఫొటో గోడ‌కు త‌గిలించ‌కుడా, టేబుల్ మీద పెట్టి ఉంది. ఆ ఫొటోతో పాటు కొన్ని దేవుళ్ల ఫొటోలు కూడా టేబుల్ మీద పెట్టి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో స‌చివాలయంలోని నాలుగో బ్లాక్‌ లో ఉన్నత విద్యాశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి స్నాక్స్‌ ఏర్పాటుచేశారు. అయితే, ఆ స్నాక్స్ ను స‌ర్వ్ చేయ‌డానికి ట్రే లేక‌పోవ‌డంతో ఆ టేబుల్ పై ఉన్న సీఎం ఫొటోను ట్రేలా వాడేశారు.

అంతేకాదు, కార్య‌క్ర‌మం అయిపోయిన త‌ర్వాత ఆ ప్లేట్ల‌ను టేబుల్ పై దేవుళ్ల ఫొటో ఫ్రేంల ప‌క్క‌న ఉన్న‌ చంద్రబాబు ఫోటో ఫ్రేంపై పెట్టి వెళ్లారు. అయితే, ఇదేదో అనుకోకుండా జ‌రిగింది కాద‌ని, కొంత‌మంది ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశార‌ని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ - మరో అధికారి పాండా దాస్ - జేఎన్‌ టీయూ అధికారులు పాల్గొన్న సమావేశంలో ఇటువంటి నిర్ల‌క్ష్య‌పూరిత ఘటన జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ నోట‌ - ఈ నోట ప‌డి ఈ విషయం అధికార వర్గాల‌కు - టీడీపీ శ్రేణుల‌కు తెలిసింది. సీఎంను అవ‌మానించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. వెంట‌నే సీఎం - దేవుళ్ల‌ ఫొటోల‌ను గోడ‌కు త‌గిలించాలని కోరుతున్నాయి.