Begin typing your search above and press return to search.

బాబుకు దూర‌మ‌వుతున్న ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు?

By:  Tupaki Desk   |   3 Nov 2017 1:51 PM GMT
బాబుకు దూర‌మ‌వుతున్న ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుకు మ‌రోమారు ప్ర‌భుత్వ ఉద్యోగులు దూర‌మ‌వుతున్నారా? ఇటీవ‌లి వ‌రుస సంఘ‌ట‌నలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయా? ఇలాంటి చ‌ర్చ‌ల‌కు రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. గ‌తంలో తాను ఉద్యోగుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా...ఈ ద‌పా న‌డుచుకోబోన‌ని...ముఖ్యమంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన తర్వాత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కొద్దికాలం వ‌ర‌కు చంద్ర‌బాబు ఇలాగే న‌డుచుకున్నార‌ని కూడా టాక్ ఉంది. రాజధానిని హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లించిన స‌మ‌యంలో ఐదు రోజుల ప‌నిదినాలు - ఇత‌రత్రా భ‌త్యాల విష‌యంలో బాబు ఉదార‌త‌ను చాటుకున్నార‌నే భావ‌న వ‌చ్చింది. అయితే ఇప్పుడు బాబు ఆ తీరును మార్చుకున్నార‌ని అంటున్నారు.

ఉద్యోగుల ప‌ట్ల సానుకూలంగా ఉండ‌టం వ‌ల్ల త‌న‌ను టేకిట్ ఈజీగా భావిస్తున్నారని..దీన్ని చక్క‌దిద్దేందుకు తాను క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు భావించిన‌ట్లు చెప్తున్నారు. ఇందుకు రెండు కీల‌క ఉదాహ‌ర‌ణ‌లు ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల వ‌యోప‌రిమితికి సంబందించిన ఆదేశాల డ్రాఫ్ట్ కాపీని విడుద‌ల చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఇద్ద‌రు సెక్ష‌న్ ఆఫీస‌ర్ల‌ను ఇటీవ‌ల ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. ఇందులో ఒక‌రు న్యాయ‌శాఖ ఉద్యోగి కాగా...మ‌రొక‌రు వాట‌ర్ రిసోర్సెస్ సెక్ష‌న్ ఆఫీస‌ర్‌. ఈ ఇద్ద‌రినీ స‌స్పెండ్ చేసిన‌ ప్ర‌భుత్వం తీరును నిరసిస్తూ ఉద్యోగులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ ఎపిసోడ్‌ లోకి ఆఖ‌రికి సెక్ర‌టేరియ‌ట్ ఉద్యోగుల సంఘం నేత జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు స‌చివాల‌యంలో సీసీ కెమెరాలు బిగించాల‌నే నిర్ణ‌యంపై ఉద్యోగులు భ‌గ్గుమంటున్నారు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీసీ కెమెరాలు బిగించ‌డ‌మంటే...ప‌రిపాల‌న‌కు గుండెకాయ‌వంటి ఉద్యోగుల‌పై న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రోవైపు డీఏ చెల్లింపు, ఏరియ‌ర్స్ వంటి విష‌యాల్లో కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి తీవ్ర జాప్యం జ‌రుగుతుండ‌టాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ తాము ముఖ్య‌మంత్రి ఆదేశాల‌నుసారం...రాష్ట్రం కోసం అమ‌రావ‌తికి వ‌చ్చేస్తే...త‌మపై బాబు స‌ర్కారు క‌క్ష గ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని ప‌లువురు ఉద్యోగులు చ‌ర్చించుకుంటున్నారు.