Begin typing your search above and press return to search.

‘‘అమరావతి’’ బస్సులో అమరావతికి బయలుదేరారు

By:  Tupaki Desk   |   29 Jun 2016 6:58 AM GMT
‘‘అమరావతి’’ బస్సులో అమరావతికి బయలుదేరారు
X
ఒక చారిత్రాత్మక ఘట్టానికి మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా ఉన్న ఏపీ సచివాలయం హైదరాబాద్ నుంచి శాశ్వితంగా తనదైన రాజధాని నగరమైన అమరావతికి తరలి వెళుతోంది. ఈ మధ్యాహ్నం 2.59 గంటల సమయంలో ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఏపీ సచివాలయ శాఖలు లాంఛనంగా అడుగుపెట్టనున్నాయి.

ఈ కార్యక్రమం కోసం ఏపీ సచివాలయ ఉద్యోగులు బుధవారం ఉదయం ఏపీ సచివాలయ ప్రాంగణం నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో అమరావతికి బయలుదేరారు. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ‘అమరావతి’ బస్సుల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు బయలుదేరి వెళ్లటం గమనార్హం. ఈ రోజు నుంచి మొదలయ్యే సచివాలయ తరలింపు ప్రక్రియ వచ్చే నెల మూడో వారం వరకూ కొనసాగనుంది.

తరలింపు సందర్భంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో భిన్న భావోద్వేగాలు కనిపించాయి. కొందరు తీవ్రమైన భావోద్వేగంతో గంభీరంగా ఉండిపోగా.. మరికొందరు మాత్రం హ్యాపీగా ఉన్నట్లు కనిపించారు. మరికొందరు మాత్రం తప్పదు కదా? ధోరణి వ్యక్తమైతే.. మరికొందరిలో మాత్రం విభజన కారణంగా ఏపీకి తీవ్ర అన్యాయం చేశారన్న భావన వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. ఇంకొందరు మాత్రం.. అమరావతి రాజధానిగా ఏపీ అభివృద్ధిని తీసుకెళ్లేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని మీడియాతో చెప్పటం కనిపించింది.