Begin typing your search above and press return to search.

ఏపీకి బీజేపీ వరాలు .. టీడీపీతో పొత్తు వెనక...?

By:  Tupaki Desk   |   2 Sep 2022 11:30 PM GMT
ఏపీకి బీజేపీ వరాలు .. టీడీపీతో పొత్తు వెనక...?
X
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పార్టీ ఏమైనా చేస్తుందని టీడీపీ అధినాయకుడు చంద్రబాబు అంటున్నారు. బీజేపీతో పొత్తు విషయంపై ఆయన పక్కాగా క్లారిటీ ఇవ్వకున్నా ఇండైరెక్ట్ గా చెప్పాలనుకున్నది చెప్పేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. 2018లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి వేరుపడ్డామని బాబు అంటున్నారు. ఇపుడు ఏపీలో అంతకంటే దారుణమైన పాలన సాగుతోందని ఆయన చెబుతున్నారు.

ఏపీలో వైసీపీని ఇంటికి పంపించాలంటే ఏమి చేయాలో అదే చేస్తామని అంటున్నారు. ఆ దిశగా బీజేపీ సాయం తీసుకుంటామని ఆయన చెప్పకనే చెబుతున్నారు అనుకోవాలి. అయితే 2018లో ఎందుకు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు ఇపుడు ఎందుకు కలుస్తున్నారు అంటే దానికి టీడీపీ ఏపీ జనాలకు సరైన జవాబు ఇచ్చుకోవాలి. లేకపోతే జనాలు కన్వీన్స్ అయ్యే చాన్స్ లేదు. అందుకే అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఇదే విషయం మీద రిసెర్చ్ చేస్తున్నాయని అంటున్నారు.

ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని బీజేపీ చెబితే టీడీపీ పొత్తు పెట్టుకోవచ్చు. అయితే అలా ఏదో పైపైన అనేస్తే కుదిరే వ్యవహారం ఉండదు, స్పెసిఫిక్ గా ఫలానా అంశాలకు మేము భరోసా ఇస్తామని చెప్పాలి. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి పూర్తి నిధులు ఇస్తామని, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచి పూర్తి చేసేందుకు బడ్జెట్ సపోర్ట్ చేస్తామని చెప్పాలి. అలాగే విభజన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తామని కూడా చెప్పాలి.

ఏపీని ఆర్ధికంగా ఆదుకుంటామని చెప్పాలి. అలా బీజేపీ చెబితే అపుడు ఏపీ అభివృద్ధి కోసం తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చంద్రబాబు ప్రకటన చేయగలుగుతారు. అయితే ప్రత్యేక హోదా మాటేంటి అంటే ఆ విషయం మాత్రం బీజేపీ పెదవి విప్పదు, అది ముగిసిన అధ్యాయం అని ఇప్పటికే చెబుతోంది. దాంతో ఆ విషయం లేకుండా మిగిలిన వాటిని టచ్ చేస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు.

అన్నింటికీ మించి ఇక్కడ బీజేపీ మీద జన విశ్వాసం పోయింది అని అంటున్నారు. ఏపీలో 2014లో ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు బాబు మోడీ జోడీ ఏపీకి ఫుల్ డెవలప్మెంట్ అంటే నమ్మి ఓటేశారు. అయితే ఆ తరువాత ఇన్నేళ్ళుగా చూస్తూ వస్తున్న ఏపీ జనాలు బీజేపీ ఏపీకి ఎంతో చేస్తామని చెబితే నమ్ముతారా. పైగా కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో అంతకు అంతా బీజేపీ మీద కూడా ఉంది అని అంటున్నారు.

ఇక దేశంలో మోడీ మీద బీజేపీ మీద మునుపటి క్రేజ్ లేదు సరికదా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దాంతో ఆ వ్యతిరేకత కచ్చితంగా పొత్తు పెట్టుకున్న టీడీపీ కూడా మోయాల్సిరావచ్చు. చివరికి ఏపీ ప్రగతి కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్న్నాను అని చంద్రబాబు చెప్పినా అది బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఈ విషయాలు అన్నింటి మీద తెర వెనక మల్లగుల్లాలు రెండు పార్టీలు పడుతునాయా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీతో టీడీపీ పొత్తు ఈసారి ఖరారు అయింది అంటే అది ఫక్తు రాజకీయమే అని జనాలు అనుకుంటారు తప్ప మరోటి కాదు, ఇక ఈ పొత్తు ఉన్నా లేకపోయినా వైసీపీని వ్యతిరేకించే వర్గాలు టీడీపీకే ఓటేస్తాయి. పొత్తులో భాగంగా బీజేపీకి సీట్లు ఇచ్చిన చోట్ల మాత్రం ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.