Begin typing your search above and press return to search.

ఆ 23 మందిపై చంద్రబాబు ఫైర్‌!

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:30 PM GMT
ఆ 23 మందిపై చంద్రబాబు ఫైర్‌!
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందులోనూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమనేది టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దృష్టి సారించారు.

మరోవైపు జనవరి 27 చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఏకధాటిగా 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని సంకల్పించారు. చిత్తూరు జిల్లాలోని తన తండ్రి నియోజకవర్గం కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు పాదయాత్ర లోకేష్‌ సిద్ధమవుతున్నారు.

మరోవైపు కొంతమంది నేతలు ఇప్పటికీ చురుగ్గా వ్యవహరించడం లేదని చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. వీరిలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారిలో భూమా అఖిల ప్రియ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అలాగే నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్‌ హత్య చేయడంతో ఆయన కుమారుడికి మంత్రిగా అవకాశమిచ్చారు.

ఈ నలుగురితోపాటు జలీల్‌ ఖాన్, జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, సుజయకృష్ణ రంగారావు, కలమట వెంకట రమణ, డేవిడ్‌ రాజు, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణిగాంధీ, జయరాములు, అత్తార్‌ చాంద్‌ బాషా, వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, పాశం సునీల్‌ కుమార్, అశోక్‌రెడ్డి ముత్తుముల కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

వీరందరికీ 2019లోనూ చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. అయితే వీరిలో అద్దంకి నుంచి ఒక్క గొట్టిపాటి రవికుమార్‌ ఒక్కరే గెలుపొందారు. మిగతా వారంతా పరాజయం పాలయ్యారు.

ఇప్పుడు నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానుండటంతో జిల్లాలవారీగా పాదయాత్ర కోసం కమిటీలు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి టీడీపీ చేరినవారి నుంచి మాత్రం స్పందన లభించడం లేదని తెలుస్తోంది.

వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారు యాక్టివ్‌గా తిరిగితే తమ తడాఖా చూపడం ఖాయమని జగన్‌ ప్రభుత్వం హెచ్చరించిందని అందుకే వారు అప్పటి నుంచి గప్‌చుప్‌ అయిపోయారని చెబుతున్నారు.

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము పార్టీ మారినందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అప్పటి నుంచి సైలెంట్‌ అయిపోయారని అంటున్నారు.

ఇప్పుడు నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలోనూ వారు తమ సైలెన్స్‌ను వీడటం లేదని ప్రచారం సాగుతోంది. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇలా ఎన్నాళ్లు భయపడి దాక్కుంటారని వారిపై ఆయన మండిపడ్డట్టు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.