Begin typing your search above and press return to search.

అయ్యో...వైసీపీ.... అయ్యోర్లు ఆగ్ర‌హంతో ఉన్నారు

By:  Tupaki Desk   |   28 Dec 2022 10:30 AM GMT
అయ్యో...వైసీపీ.... అయ్యోర్లు ఆగ్ర‌హంతో ఉన్నారు
X
ఏపీ ప్ర‌భుత్వంపై ఉపాధ్యాయుల్లో పీక‌లదాకా కోపం ఉంద‌న్న సంగ‌తి ఆ పార్టీ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ విష‌యం ఆ పార్టీలో అంద‌రికీ తెలిసిన సంగ‌తే అయినా పైకి అది క‌నిపించ‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌చ్చారు. అయితే క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలు మాత్రం టీచ‌ర్లలో నెల‌కొన్న అసంతృప్తి ఆగ్ర‌హంతో ఆందోళ‌న చెందుతున్నారు. టీచ‌ర్లు ఎక్క‌డ త‌మ గెలుపు అవ‌కాశాల‌పై దెబ్బేసేస్తారోన‌ని హ‌డ‌లి పోతున్నారు. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి టీచ‌ర్లు త‌మ పార్టీ ప‌ట్ల ఎంత ఆగ్ర‌హంతో ఉన్నారో కుండ‌బ‌ద్దలు కొట్ట‌డం వైసీపీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై టీచ‌ర్లు గుర్రుగా ఉన్నారు. పీఆర్సీతో టీచ‌ర్లు ప్ర‌భుత్వంపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేప‌ట్టిన చ‌లో విజ‌యవాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంలో అప్ప‌ట్లో టీచ‌ర్లే కీల‌క పాత్ర పోషించారు. అప్ప‌టి నుంచీ ప్ర‌భుత్వానికి టీచ‌ర్ల‌కు మ‌ధ్య అగాథం పెరుగుతూ వ‌స్తోంది.

ఈ ఆందోళ‌న త‌రువాత విద్యాశాఖ టీచ‌ర్ల విధి నిర్వ‌హ‌ణ‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. వారికి ముఖ హాజ‌రీ త‌ప్ప‌నిస‌రి చేసింది. యాప్‌ల నిర్వ‌హ‌ణ అంటూ ఇత‌ర‌త్రా ప‌ని భారం పెంచింది. ఈ చ‌ర్య‌ల‌న్నీ బ్యాక్ ఫైర్ అయ్యాయ‌నే అభిప్రాయం నెల‌కొంది. ప్ర‌భుత్వం టీచ‌ర్ల‌పై క‌క్ష సాధింపు చర్య‌కు పాల్ప‌డుతోంద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

అధికార పార్టీ కూడా టీచ‌ర్లు మ‌న‌కు స‌హ‌క‌రించ‌రు అనే భావ‌న‌కొచ్చేసిన‌ట్లు స‌మాచారం. ఎన్నిల‌క విధుల్లో టీచర్లు పాల్గొంటే పార్టీ దెబ్బైపోతుంద‌ని భావించి టీచ‌ర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు వినియోగించ‌కుండా కేవ‌లం పాఠాలు చెప్ప‌డం వ‌ర‌కే ప‌రిమితం చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

ఇది రాజ‌కీయంగా వివాదాస్ప‌ద నిర్ణ‌యంగా మారింది. ఇది కూడా టీచ‌ర్ల‌కు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం తెప్పించింది. ఇప్పుడు తాజాగా టీచ‌ర్ల బ‌దిలీలు అంశం కూడా వివాదాస్ప‌ద‌మైంది. ఈ నేప‌థ్యంలో టీచర్లు ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నార‌నే విష‌యం వైసీపీ నేత‌ల‌కు అర్థ‌మైపోయింది.

తాజాగా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి వైసీపీలో ఉన్న ఈ గుబుల‌ను బ‌య‌ట‌పెట్టేశారు. త‌మ ప్ర‌భుత్వంపై టీచ‌ర్లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నే సంగ‌తి మాకు తెలుసునన్నారు. అయితే టీచ‌ర్లు విద్యుక్త ధ‌ర్మం ముఖ్య‌మ‌ని పిల్ల‌కు మంచి పాఠాలు చెప్పాల‌ని కోరారు. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న విద్యార్థులు వారి త‌ల్లిదండ్రుల ద్వారా త‌మ పార్టీకి ఓట్లు వేయించ‌గ‌ల‌ర‌ని రాచ‌మ‌ల్లు వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు వైసీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.