Begin typing your search above and press return to search.

బీజేపీ అధ్యక్షుల మార్పు.. అసలు ప్లానేంటి?

By:  Tupaki Desk   |   22 Feb 2020 4:25 AM GMT
బీజేపీ అధ్యక్షుల మార్పు.. అసలు ప్లానేంటి?
X
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు ఇంతకంటే హాట్ ప్రశ్న ఇంకొకటి లేదు. కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణలో బలపడాలని చూస్తోంది. ఇందుకు గడిచిన ఐదేళ్లలో అంతగా ఫలితాలు కనపడలేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ ను మారుస్తారని ఖాయమైంది.కానీ ఆయన వారసుడు ఎవరు? ఇప్పుడు ఇదే చిక్కుప్రశ్న.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే తేనెతుట్టను మళ్లీ కదిపారు బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.. త్వరలోనే ఏపీ, తెలంగాణలకు బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నాడని.. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని బాంబు పేల్చారు. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు తెలంగాణతోపాటు, ఆంధ్రా బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

దీంతో ప్రస్తుతం ఉన్న లక్ష్మణ్, కన్నా లక్ష్మీనారాయణల మార్పు ఖాయం అన్న ప్రచారం సాగుతోంది. రెండు రాష్ట్రాలకు కొత్త వారిని తీసుకుంటే వారు ఎవరు అనే ఆసక్తి నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ నేతల్లోనూ గందరగోళం సృష్టించింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం విద్యాసాగర్ రావు ఫ్లేట్ ఫిరాయించారు. రాష్ట్ర అధ్యక్షులను నియమించేది తాను కాదని.. జాతీయ నాయకత్వం చూసుకుంటుందని విద్యాసాగర్ రావు దాటవేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వారిని కూడా కొనసాగించవచ్చు అని పార్టీలో రేగిన అసమ్మతిని చల్లార్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నారు.

మహారాష్ట్ర గవర్నర్ గా దిగిపోయాక తెలంగాణ బీజేపీ పగ్గాలను విద్యాసాగర్ రావు చేపడుతారని చర్చ జరిగింది. బీజేపీ ఈయననే కేసీఆర్ పై తురుపుముక్కగా దించుతుందని భావించారు. కేసీఆర్ సామాజిక వర్గానికే చెందిన విద్యాసాగర్ రావు అయితే ధీటుగా జవాబివ్వగలడని యోచిస్తోంది. ఆ క్రమంలోనే ఆయనతోనే ఈ వ్యాఖ్యలు చేయించారా అన్న ఊహాగానాలు బీజేపీలో వ్యక్తమవుతున్నాయి.