Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు జగన్ షాక్.. టీ ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యూనల్ కు ఏపీ ఫిర్యాదు?

By:  Tupaki Desk   |   18 May 2020 4:16 PM GMT
కేసీఆర్ కు జగన్ షాక్.. టీ ప్రాజెక్టుపై కృష్ణా ట్రిబ్యూనల్ కు ఏపీ ఫిర్యాదు?
X
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య జల వివాదాలు మరింత ముదిరాయనే చెప్పాలి. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేస్తూ ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203పై ఇప్పటికే తెలంగాణ సర్కారు కృష్ణా ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ కూడా తెలంగాణలో నిర్మిస్తున్న 5 సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు రాష్ట్రాలు జల వివాదాలపై బస్తీ మే సవాల్ అన్న రీతిలోనే ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయని చెప్పక తప్పదు. నీటి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తీవ్ర రూపం దాల్చినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ మోహన్ రెడ్డి సర్కారు జారీ చేసిన జీవోపై ఇదివరకే తెలంగాణ సర్కారు ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదుపై ట్రిబ్యూనల్ ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకముందే.. ఏపీ తనదైన శైలిలో దూకుడు పెంచింది. కృష్ణా జలాల ఆధారంగానే తెలంగాణలో నిర్మించ తలపెట్టిన 5 ప్రాజెక్టుపై ఏపీ సర్కారు సోమవారం ఏకంగా ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం కృష్ణా ట్రిబ్యూనల్ ఇంచార్జీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ను కలిసి తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. తాము ప్రస్తావించిన తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగానే ఉన్నాయని కూడా ఏపీ అదికారులు ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

అంతేకాకుండా ఇప్పటికే సదరు ప్రాజెక్టులపై తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను పంపాలని తెలంగాణను ఆదేశించిందని కూడా ఏపీ అధికారులు ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే కేంద్రం ఆదేశించినా కూడా ఇప్పటిదాకా సదరు ప్రాజెక్టుల డీపీఆర్ ను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అందించలేదని కూడా ఫిర్యాదు చేశారట. మొత్తంగా సదరు ఐదు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సర్కారు... ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగానే సాగుతోందని ఏపీ అధికారులు ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. వెరసి రెండు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగం పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింతగా ముదిరిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.