Begin typing your search above and press return to search.

అసోంలో ఓకే ...ఏపీ తెలంగాణా నియోజకవర్గాల పునర్విభజన ఎపుడు...?

By:  Tupaki Desk   |   28 Dec 2022 3:30 PM GMT
అసోంలో ఓకే ...ఏపీ తెలంగాణా నియోజకవర్గాల పునర్విభజన ఎపుడు...?
X
సడెన్ గా అసోం లో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం పునర్విభజన కసరత్తుకు ఉపక్రమించింది. ఆర్టికల్ 170 ప్రకారం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారు. ఈ పునర్విభజన అయ్యేంతవరకూ నూతన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ల మీద నిషేధాన్ని విధించారు.

ప్రస్తుతం అసోం లో 14 లోక్ సభ సీట్లు ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అసోం లో చివరిసారిగా 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అపుడు 1971 లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇపుడు 2001 జనాభా లెక్కల ఆధారంగా కొత్త నియోజకవర్గాలు ఎన్ని కావాలో తేలుస్తారు.

అసోం విషయం పక్కన పెడితే 2014లో ఉమ్మడి ఏపీని రెండుగా విభజించారు. అపుడు విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225గానూ అలాగే తెలంగాణాలో ఉన్న 119 సీట్లను 153కి పెంచాలని చట్టంలో వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ఈ పునర్విభజన సాగాలని స్పష్టీకరించారు.

కానీ ఇప్పటికి ఎనిమిదిన్నర ఏళ్ళు గడచినా ఈ విభజన హామీని పక్కన పెట్టేశారు. అంతే కాదు 2026 వరకూ ఏపీ తెలంగాణాలలో పునర్విభజన ఉండదని కేంద్రం ఇటీవల తేల్చేసింది. ఇదిలా ఉంటే సెక్షన్ 27 ప్రకారం నియోజకవర్గాలను ఎపుడైనా విభజించే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. అయినా సరే ఏపీ తెలంగాణాల విషయంలో మాత్రం ఈ విభజన హామీని ఎందుకో నెరవేర్చడం లేదు అని అంటున్నారు.

ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గట్టిగానే ప్రస్తావించింది. పెండింగ్ లో ఉన్న అన్ని విభజన సమస్యలను కూడా పరిష్కరించాలని, హామీలను తీర్చాలని కోరింది. దీని మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా విభజన హామీలను తక్షణం నెరవేర్చేలా చూడాలని ఏపీ సర్కార్ కోరింది.

కానీ చాలా హామీలు ఈ రోజుకీ పెండింగులో ఉన్నట్లుగానే నియోజకవర్గాల పునర్ విభజన అంశం కూడా అలాగే ఉండిపోయింది. ఇక అసోం విషయం తీసుకుంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2024లో ఎన్నికలు ఉన్నాయి. ఇపుడు ఉన్న 14 ఎంపీ సీట్లు కనుక పెరిగితే అది రాజకీయంగా బీజెపీకి లాభిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. అదే విధంగా అసోం రాష్ట్రంలో మరో విడత అఢికారంలోకి బీజేపీ రావడానికి కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన దోహదపడుతుంది అన్న ఆలోచనలు కూడా ఉండి ఇపుడు ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు.

అదే ఏపీ తెలంగాణాలో తీసుకుంటే రాజకీయంగా బీజేపీకి కలసివచ్చేది లేదు. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణాలో బీజేపీకి 119 మంది అసెంబ్లీ సీట్లలో అభ్యర్ధుల కొరత 2023 ఎన్నికల్లో ఉండవచ్చు అని అంటున్నారు. అది కాస్తా 153 అయితే మరీ కష్టం అవుతుంది. ఇక అధికార టీయారెస్ కి ఈ విభజన వల్ల లాభం గరిష్టంగా ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి.

ఇక ఏపీలో చూసుకున్నా అదే పరిస్థితి ఉంటుంది. వైసీపీ ఇక్కడ బలంగా ఉంది. ఆ పార్టీకి ఎక్కువ మంచి ఆశావహులు ఉంటారు. అలాగే విపక్షంలో ఉన్న టీడీపీకి కూడా ఎక్కువ సీట్లు ఉంటే చాలా తలనొప్పులు తగ్గిపోతాయి. కానీ బీజేపీకి ఇక్కడ ఏ మాత్రం రాజకీయ బలం లేదు. సరిగ్గా ఈ కారణాలనే దృష్టిలో ఉంచుకుని బీజేపీ నియోజకవర్గాల పునర్ విభజన విషయంలో సాచివేత ధోరణితో వ్యవహరిస్తోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.