Begin typing your search above and press return to search.

నిధుల కోసం కేంద్రంపై ఏపీ - తెలంగాణ పోరు!!

By:  Tupaki Desk   |   19 Sep 2020 11:10 AM GMT
నిధుల కోసం కేంద్రంపై ఏపీ - తెలంగాణ పోరు!!
X
కరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఓ వైపు ఖజానాకు ఆదాయం తగ్గడం...మరోవైపు కరోనా కట్టడికి ఖర్చులు పెరగడం వంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను తర్వాత చెల్లిస్తామని, ఈ లోపు ఆ మొత్తాన్ని అప్పు తెచ్చుకోవాలని కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. అసలే కరోనా కష్ట కాలంలో ఉన్నామని, జీఎస్టీ బకాయిల చెల్లింపుల కోసం కేంద్రమే అప్పు చేయాలమి, రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు చేపట్టాని రాష్ట్రాలు కోరుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఒకవైపు స్థానికంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే కేంద్రం నుంచి వీలైనంతగా సాయం పొందేందుకు పార్లమెంటు వేదికగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు తరచూ వినతులను సమర్పిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీకి ఆర్థిక సాయం అందించాలంటూ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. ఏపీని లోన్ల రూపంలో కాకుండా గ్రాంట్ల రూపంలో ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీ ఆర్థిక లోటును ఎదుర్కొంటోందని, కరోనా విపత్తుతో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైందని పేర్కొన్నారు.

ఏపీ‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉందని,, కోవిడ్-19 ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని మోపిదేవి సభలో ప్రస్తావించారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ఏపీ ముందుందని, విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సభకు తెలిపారు. జీఎస్టీ వసూళ్ళు దారుణంగా పడిపోవడంతో రాష్ట్రం ఇబ్బందుల పాలైందని మోపిదేవి అన్నారు. కాగా, జీఎస్టీ బకాయిలను కేంద్రం స్వయంగా విడుదల చేయాలయిన, రాష్ట్రాలను అప్పులు తెచ్చుకోవాలనడం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు సభలలో ప్రస్తావించారు. ఈ రకంగా ఇటు టీఆర్ఎస్, అటు వైసీపీ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు, జీఎష్టీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.