Begin typing your search above and press return to search.

ఏపీ పదో తరగతి ఫలితాలు ఇంత తక్కువగానా.. అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   7 Jun 2022 5:49 AM GMT
ఏపీ పదో తరగతి ఫలితాలు ఇంత తక్కువగానా.. అసలేం జరిగింది?
X
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు జూన్ 7న విడుదలయ్యాయి. అయితే ఉత్తీర్ణత గత 20 ఏళ్లలో లేనంత దారుణంగా పడిపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 6,15,908 మంది పరీక్షలు రాస్తే 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో 2002లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈసారే ఇంత తక్కువగా 67.26 శాతం నమోదవడం గమనార్హం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు అంటూ పాఠశాల విద్యను భ్రష్టు పట్టించిందని అందుకే ఇంత దారుణమైన ఫలితాలు వెలువడ్డాయని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లు కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉందని, తరగతులు సరిగా జరగలేదని, ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందించడానికి తాము చేయాల్సిందంతా చేశామని చెబుతోంది.

అయితే పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోవడానికి పాఠశాలల్లో ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల కొరత, కోవిడ్ తో రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకపోవడం, మారిన పదో తరగతి పరీక్షల విధానం, కోవిడ్ తో పాఠశాలలు ఆలస్యంగా పున:ప్రారంభం కావడం వంటివి దోహదం చేశాయని విద్యావేత్తలు, నిపుణులు అంటున్నారు. కోవిడ్ కారణంగా విద్యార్థులు గత రెండేళ్లు 8, 9 తరగతులు చదవకుండానే పదో తరగతికి వచ్చేశారని గుర్తు చేస్తున్నారు. దీంతో వారికి ఆయా సబ్జెక్టుల్లో పరిజ్ఞానం కొరవడిందని చెబుతున్నారు. అంతేకాకుండా పదో తరగతికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి దిగువ తరగతులపై ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టలేదని అంటున్నారు. దీంతో 8, 9 తరగతుల విద్యార్థులు పదో తరగతికి వచ్చాక వారికి ఆయా సబ్జెక్టుల్లో విషయ పరిజ్ఞానం కొరవడిందని పేర్కొంటున్నారు.

వాస్తవానికి గత రెండేళ్లు కోవిడ్ తో స్కూళ్లు మూసి ఉండటం, తరగతుల నిర్వహణ లేకపోవడం, ఆన్లైన్, టీవీల ద్వారా విద్యా సంస్థలు, ప్రభుత్వం డిజిటల్ క్లాసులు నిర్వహించినా ఇంటర్నెట్, డిజిటల్ పరికరాల లేమితో విద్యార్థులకు ఆయా పాఠాల బోధన సరిగా జరగలేదని నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో పాఠశాలలు పున:ప్రారంభమయ్యాక విద్యా వ్యవస్థపై అధికారులు ఎంతో పర్యవేక్షణ, పరిశీలన చేయాల్సి ఉండగా చేయలేదని చెబుతున్నారు. ముఖ్యంగా 8, 9 తరగతుల విద్యార్థులకు గత రెండేళ్లు కోవిడ్ తో పాఠాల బోధన సరిగా జరగలేదు. దీంతో వారికి పబ్లిక్ పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో వారు ఈ విద్యా సంవత్సరం పదో తరగతికి వచ్చాక ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉందని.. అయితే ఇది లేకపోవడంతో ఫలితాలు దారుణంగా వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

కాగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష పరీక్షల్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్ లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. తెలుగులో 91.73% పాస్ పర్సంటేజ్ నమోదవగా.. చాలా సులువైన సబ్జెక్టుగా అందరూ భావించే సోషల్ లో కేవలం 81.43% మంది మాత్రమే పాస్ అయ్యారు. రాష్ట్రంలో 71 బడుల్లో ఒక్కరూ పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూల్స్ 31, ప్రభుత్వ స్కూళ్లు 40 ఉండడం గమనార్హం. 2019లో సున్నా ఫలితాలు వచ్చిన ప్రభుత్వ బడి ఒక్కటీ లేకపోగా.. రెండేళ్లలోనే ఇంతటి దారుణ పరిస్థితి ఏర్పడడంపై జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి.

కాగా కోవిడ్ తో గతేడాది ఆలస్యంగా ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల సెప్టెంబర్ రెండో వారానికి కానీ అంతా కుదురుకోలేదు. మరోవైపు జగన్ ప్రభుత్వం వచ్చాక డీఎస్సీని ప్రకటించి టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. దీంతో పాఠశాలల్లో దాదాపు 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. అలాగే ఉన్నత పాఠశాలలుగా మారిన 500 స్కూళ్లకు ప్రధానోపాధ్యాయులు లేరని అంటున్నారు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా పదో తరగతి ఫలితాలు దారుణంగా తగ్గిపోవడానికి పరీక్షల విధానంలో చేసిన మార్పులే కారణమంటున్నారు. 2019 వరకు హిందీ మినహాయించి మిగిలిన ఐదు సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉండేవి. హిందీ ఒక పేపరుతో కలిపి మొత్తం 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడు పేపర్లకు కుదించారు. గతంలో ఒక పేపర్‌లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్‌లో కవర్‌ చేసుకునేవారు. ఈసారి ఒకే పేపర్‌ కావడంతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ఫలితాలు చాలా తక్కువగా నమోదయ్యాయి.