Begin typing your search above and press return to search.

‘80’ స్పీడ్ దాటకూడదంటున్న బాబు

By:  Tupaki Desk   |   28 Feb 2016 9:24 AM GMT
‘80’ స్పీడ్ దాటకూడదంటున్న బాబు
X
మితిమీరిన వేగంతో చోటు చేసుకుంటున్న ప్రమాదాల కట్టడికి ఏపీ సర్కారు కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్డు ప్రమాదాలకు చెక్ చెప్పటంతో పాటు.. రహదారుల భద్రతను మరింత పెంచే నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నారు. దీని ప్రకారం.. ఏపీలో ప్రయాణించే లారీలు.. బస్సుల వేగాన్ని గంటకు 80కిలోమీటర్లు దాటకూడదని డిసైడ్ చేశారు. ఏపీలో ప్రయాణించే వాహనాల వేగ సామర్థ్యం 80కి దాటకుండా ఉండేలా చూడనున్నారు. ఇందులో భాగంగా వేగ నియంత్రణ పరికరాల్ని అమర్చాలన్న ఆదేశాల్ని జారీ చేయాలని నిర్ణయించారు.

తాజా నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. లారీలు.. బస్సులు గంటకు 80 కిలోమీటర్లు దాటకూడదని.. అదే సమయంలో బడి బస్సులు.. ట్యాంకర్ల వేగం గంటకు 60కిలోమీటర్లకు దాటకూడదన్న నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం పక్కాగా అమలైతే.. రహదారుల్లో చిమ్ముతున్న రక్తం తగ్గటం ఖాయమని భావిస్తున్నారు.

ఈ కఠిన నిబంధన లారీలు.. ప్రభుత్వ.. ప్రైవేటు బస్సులు.. పాఠశాలల బస్సులు.. ట్యాంకర్లతో పాటు.. భారీ వాహనాలన్నింటికి అమలు చేయనున్నారు. ఇందుకోసం వాహనాల్లో వేగ నిరోధక యంత్రాల్ని అమర్చాలన్నది తప్పనిసరి చేయనున్నారు. ఒకవేళ ఇలాంటివి అమర్చకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కొత్త నిర్ణయానికి ప్రైవేటు వాహనాల్ని మినహాయింపు ఇచ్చారు. 3500కేజీల బరువు.. ఎనిమిది సీట్ల వరకు వ్యక్తిగతంగా వినియోగించే వాహనాలకు స్పీడ్ మినహాయింపులు ఇవ్వనున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న తాజాగా నిర్ణయం రోడ్డు ప్రమాదాల్ని తగ్గించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.