Begin typing your search above and press return to search.

ఏపీ ఉద్యోగ సంఘం నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకోర్టు ఏం చేయనుంది?

By:  Tupaki Desk   |   23 Aug 2022 4:30 PM GMT
ఏపీ ఉద్యోగ సంఘం నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. హైకోర్టు ఏం చేయనుంది?
X
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయనపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు కృష్ణాంజనేయులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం న్యాయమూర్తుల తీర్పులను తప్పుబడుతూ.. న్యాయమూర్తులను అవమానించేలా సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారని తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు.

కొద్ది రోజుల క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని తిడితే మాత్రం గంటలోనే బెయిల్ ఇస్తున్నారని.. అదే న్యాయమూర్తులను తిడితే మూడు నెలలకు కానీ బెయిల్‌ రావడం లేదన్నారు. న్యాయమూర్తులకో న్యాయం... ముఖ్యమంత్రికో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు మేలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులంతా కాపాడుకోవాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌ ప్రభుత్వానికి ఉద్యోగులంతా అండగా ఉండాలని కోరారు.

జడ్జిలకు మాత్రమే ఆత్మాభిమానం ఉంటుందా? ముఖ్యమంత్రికి ఉండదా? సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కూడా కోర్టుకు పిలిపించి గంటల కొద్దీ వెయిట్‌ చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యాయమూర్తులు నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా డిగ్నిఫైడ్‌గా వ్యవహరించాలన్నారు. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్నారు.

కాగా ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హైకోర్టు న్యాయమూర్తులు దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. హైకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది. సీబీఐకి విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. మరికొందరిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి వ్యవహారంలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.