Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలోని పెట్రోలు బంకులకు ఏపీ వాహ‌న‌దారుల క్యూ!

By:  Tupaki Desk   |   23 July 2022 8:35 AM GMT
ఆ రాష్ట్రంలోని పెట్రోలు బంకులకు ఏపీ వాహ‌న‌దారుల క్యూ!
X
క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ఉంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల వాసుల‌కు ఇప్పుడు క‌లిసి వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పోలిస్తే క‌ర్ణాట‌క‌లో పెట్రోలు, డీజిల్ రేట్లు త‌క్కువ ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. దీంతో ఏపీలోని అనంత‌పురం, చిత్తూరు, శ్రీస‌త్య‌సాయి జిల్లాల్లోని వాహ‌న‌దారులంతా క‌ర్ణాట‌క పెట్రోలు బంకుల్లో డీజిల్, పెట్రోలు కొట్టించుకుంటున్నారు.

వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) కర్ణాటకలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉండటం, దీనికి తోడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదనపు వ్యాట్ వేయ‌డం. రోడ్డు అభివృద్ధి సెస్ అంటూ మ‌రికొంత వ‌సూలు చేయ‌డం ఇలా క‌ర్ణాట‌క‌లో కంటే ఏపీలోనే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అధికంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఏపీ వాహ‌న‌దారులంతా చలో క‌ర్ణాట‌క అంటూ క్యూ క‌ట్టేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రం.. కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా కేంద్రం మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై 14 పెట్రోలు బంకుల వరకు ఉన్నాయి. అందులో జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ఏడు పెట్రోల్ బంకులు మూత పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోలు బంకులో లీటరు పెట్రోల్ ధర 121.99గా, లీటరు డీజిల్ ధర 107.52గా ఉంది. అదే కర్ణాటకలోని బాగేపల్లిలో లీటరు పెట్రోల్ ధర రూ.98.56గా, లీటరు డీజిల్ ధర రూ.95.21గా ఉంది.

అంటే కర్ణాటక బంకులో కన్నా ఏపీ బంకులో పెట్రోలు ధర సుమారు రూ.14, డీజిల్ ధర సుమారు రూ.12 ఎక్కువగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. అంటే, కర్ణాటకలో 10 లీటర్ల డీజిల్ కొనుక్కుంటే దాదాపు రూ.120 ఆదా అవుతుంద‌ని అంటున్నారు. దీంతో చాలామంది కొనుగోలుదారులు కర్ణాటక బంకుల వైపు మొగ్గు చూపుతున్నారు.

జాతీయ రహదారిపై వచ్చిపోయే వాహనాల వాళ్లు, ఆంధ్రప్రదేశ్‌ వైపు ఉండే బంకుల్లో కాకుండా కర్ణాటక వైపు ఉండే బంకుల్లోనే ఎక్కువగా పెట్రోలు, డీజిల్ కొట్టిస్తున్నార‌ని అంటున్నారు. అధిక ధరల వల్ల కొనుగోలుదారులు లేక ఆంధ్రప్రదేశ్ పెట్రోలు బంకులు మూతపడటమో లేక‌ వెలవెలపోవడమో జరుగుతున్నాయ‌ని పేర్కొంటున్నారు. కర్ణాటక పెట్రోల్ బంకులు మాత్రం రద్దీగా కనిపిస్తున్నాయి. కొన్ని కర్ణాటక బంకుల్లో వచ్చిన డీజిల్ వెంటనే అయిపోవడంతో కొరత కూడా ఏర్పడుతుంద‌ని చెబుతున్నారు.