Begin typing your search above and press return to search.

మందు రేటు పెంచుతారా? మా ఓటు రేటు ఇక రూ.10 వేలు!

By:  Tupaki Desk   |   2 Dec 2021 7:30 AM GMT
మందు రేటు పెంచుతారా? మా ఓటు రేటు ఇక రూ.10 వేలు!
X
ప్ర‌జాస్వామ్య దేశంగా గొప్ప పేరున్న భార‌త్‌లో ప‌రిస్థితులు నానాటికీ దయ‌నీయంగా మారిపోతున్నాయి. త‌మ‌ను పాలించే నాయ‌కుల‌ను ప్ర‌జ‌లే ఎన్నుకుంటున్నారు. దానికి ఓటు అనే వ‌జ్రాయుధం జ‌నాల చేతుల్లో ఉంది. ఇప్పుడా ఓటు కోస‌మే నాయ‌కులు ర‌క‌ర‌కాల వేషాలు వేస్తున్నారు. విభిన్న విధాలుగా ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ పెడుతున్నారు. ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ల‌క్ష్యంతో డ‌బ్బులు చెల్లించి మ‌రీ ఓట్లు కొంటున్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌రోవైపు జనాలు కూడా నాయ‌కుల అవ‌స‌రాన్ని గ్ర‌హించి త‌మ ఓటు విలువ‌ను అమాంతం పెంచేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌క మాన‌దు. అందుకు తాజాగా ఏపీలో జ‌నాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌లే నిద‌ర్శ‌నం. మ‌ద్యం ధ‌ర‌ల‌ను దాదాపు నాలుగింత‌లు పెంచిన జ‌గ‌న్ స‌ర్కారుపై ఆగ్ర‌హంతో ఉన్న మందు బాబులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఓటుకు రూ.10 వేల చొప్పున ఇవ్వాల‌ని మాట్లాడుకుంటున్న‌ట్లు స‌మాచారం.

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. అవి ఏ ఎన్నిక‌లైనా ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం కోసం న‌గ‌దు పంపిణీ అనేది ప‌రిపాటిగా మారింద‌నేది చేదు నిజం. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తూ అధికారం కోసం పార్టీలు ఇలాంటి ప‌ద్ధ‌తులు అవ‌లంబిస్తూనే ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే ప‌రిస్థితి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో చూసుకుంటే 2014 ఎన్నిక‌ల కంటే కూడా 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో డ‌బ్బు ప్ర‌వాహం కొన‌సాగింద‌ని స‌మాచారం. ఇక ఇటీవ‌ల అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పెద్ద మొత్తంలో ఖ‌ర్చు పెట్టిన‌ట్లు వ్యాఖ్య‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎంత చేసినా చివ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ గెలిచారు.

మ‌రోవైపు ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డం కోసం జ‌గ‌న్ భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్టార‌నే అభిప్రాయాలున్నాయి. క‌నీసం ఓటుకు రూ.రెండు వేల చొప్పున ఇచ్చార‌ని.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే ఇంకా ఎక్కువే ఇచ్చార‌ని స‌మాచారం. ఇక అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన పంచాయ‌తీ, ప‌రిష‌త్‌, స్థానిక సంస్థ‌లు, మున్సిపాలిటీలు ఇలా అన్ని ఎన్నిక‌ల్లోనూ టీడీపీని చిత్తు చేసేందుకు వైసీపీ భారీగా ముట్ట‌జెప్పింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఓడితే అవ‌మాన‌మ‌ని భావించిన ఆ పార్టీ ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వ‌ర‌కూ పంచిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగో ఎన్నిక‌లు ఉన్న‌ప్పుడే నాయ‌కులు డ‌బ్బులు పంచుతారు.. ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా పోతార‌ని భావిస్తున్న జ‌నం కూడా ఆ సొమ్మును తీసుకోవ‌డానికి వెన‌కాడ‌డం లేదు. ఇప్పుడిక త‌మ ఓటుకు ఇంత ఇవ్వాల్సిందేన‌న్న డిమాండ్లు వినిపించ‌డం విడ్డూరంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా త‌మ‌కు డ‌బ్బులు పంచ‌లేద‌ని కొంత‌మంది ఓట‌ర్లు రోడ్డెక్కిన దృశ్యాలు మ‌నం చూశాం.

ఇక ఇప్పుడు ఏపీలో మందుబాబులు త‌మ ఓటు రేటును పెంచాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సంక్షేమ ప‌థ‌కాల కోసం పెద్ద మొత్తంలో ఖ‌ర్చు పెడుతున్నారు. రాష్ట్ర ఖ‌జానాలో సొమ్ము లేక‌పోయినా అప్పులు తెచ్చి మ‌రీ ప్ర‌జ‌ల‌కు పంచుతున్నారు. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు అయినా మ‌ద్యం రేట్ల‌ను నాలుగింత‌లు పెంచేశారు. మ‌ద్య‌పాన నిషేధం కోస‌మే రేట్లు పెంచామ‌ని చెబుతున్నారు. కానీ ఇప్పుడు అదే మందుబాబుల కోపానికి కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం అన్ని రేట్లు పెంచుతోంది కాబ‌ట్టి తాము కూడా త‌మ ఓటు రేటు పెంచుతామ‌ని వాళ్లు అనుకుంటున్న‌ట్లు తెలిసింది. ఓటుకు రూ.10 వేలు ఇస్తేనే కానీ ఓటు వేసేందుకు రామ‌ని తెగేసి చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్పుడీ మందుబాబుల డిమాండ్ వైర‌ల్‌గా మారుతోంది.